21, జులై 2015, మంగళవారం

ఆథ్యాత్మికం - సోషలిజం

కొంతమంది "చాతుర్వర్ణం మయా సృష్టం" అనే గీతా వాక్యాన్ని ఉటంకించి, భగవంతునికే భేద భావనను అంటగట్టి ఆ సాకుతో ఇతరులను నీచంగా చూస్తారు. కానీ అదే భగవద్గీతలో ఎన్నో సందర్భాలలో సమానత్వాన్ని గీతాచార్యుడు ప్రబోధించిన విషయాన్ని వీరు పట్టించుకోరు.

"విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే, గవి, హస్తిని, శునిచైవ, శ్వపాకేచ పండితాః సమదర్శనః" అనే గీతావాక్యం ద్వారా విద్యా వినయ సంపద కలిగిన బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగునందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం వండుకు తినేవానియందు పండితుడైనవాడు సమదృష్టి కలిగి ఉంటాడని శ్రీకృష్ణభగవానుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇలా సమాజంలో విభిన్న స్థాయిలలో ఉన్నారనుకునే వారినేకాక అనేక ఇతర రకాలైన ప్రాణులను కూడా సమాన దృష్టితో చూసేవాడే పండితుడు.

ఇక "సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే" అనే శ్లోకం ద్వారా నీకు స్నేహితులు, మిత్రులు, శత్రువులు, నిన్ను పట్టించుకోనివారు, మిత్రులూ శత్రువులూ కాక మధ్యస్తంగా ఉండేవారు, నిన్ను ద్వేషించేవారు, నీకు బంధువులు, సాధువులు, పాపులు - ఇలా అన్ని రకాల మనోభావాలు, సంబంధాలు ఉన్నవారి పట్ల సమభావం కలిగి ఉండటమే విశేషలక్షణంగా వర్ణించబడింది. ఇంకా "సమత్వం యోగ ఉచ్యతే" - సమత్వమే యోగము అని కూడా చెప్పబడింది.

వివేకచూడామణిలోని "జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం, దేశ కాల విషయాతి వర్తియత్, బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని" అనే శ్లోకాన్ని మా గురుదేవులైన శ్రీ బాబూజీ మహారాజ్ వారు తరచుగా ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే ఆథ్యాత్మికాన్నిమించిన సోషలిజం ఎక్కడా లేదని కూడా చెప్పేవారు.

ఈ సృష్టిలోని సమస్త జీవులలో, వస్తువులలో తానే నిండి ఉన్నానని విభూతి యోగంలో గీతాచార్యుడు బోధించినప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్నిదర్శించాలని ఆకాంక్షించాడు. అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు "అయితే ఇదిగో నా విశ్వరూపాన్ని చూడు" అన్నాడు. కానీ అర్జునునికి ఏమీ కనిపించలేదు. అప్పుడు భగవానుడే కరుణించి "ఈ నీ చక్షువులతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు. ఇదిగో నీకు దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను. వాటితో నా విశ్వరూపాన్ని దర్శించు" అని అర్జునునికి దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని దర్శింపచేసాడు. అప్పుడు అర్జునునికి అంతవరకూ తన ఎదుటనున్న కృష్ణుడు, చుట్టూ ఉన్న పెద్ద సైన్యం, ఇంకా విశ్వంలోని సమస్త ప్రాణులు, చివరికి తనతో సహా మొత్తం ఆ విశ్వరూపంలోనే కనిపించారు.

ఈ సందర్భంలో "సర్వ భూతస్థ మాత్మానం, సర్వ భూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః" - సమదర్శనుడైన యోగి సర్వ ప్రాణులలో ఉన్నది తానేనని, తనలోనే సర్వ ప్రాణులు ఉన్నాయని ఆత్మజ్ఞానంతో దర్శించగలుగుతాడని తెలిపే గీతావాక్యానికి అర్థంగా నిలిచాడు అర్జునుడు. అయితే ఇక్కడ "కృష్ణుడు అంతకుముందు మాములుగా ఉండి అప్పుడే విశ్వరూపాన్ని పొందాడా?" అంటే "కాదు" అనే సమాధానం వస్తుంది. ఆయన ఎప్పుడూ మార్పు లేకుండా విశ్వరూప స్థితిలోనే ఉన్నాడు. ఇక్కడ మారింది అర్జునుని దృష్టి మాత్రమే.

ఇలా మన దృష్టిని ఆథ్యాత్మిక సాధన ద్వారా మార్చుకోగలిగిన నాడు, మా ఆశ్రమ నిత్య ప్రార్థనలో భాగమైన "మానవునికీ మానవునికి మధ్య భేదబుద్ధి నశించి, సర్వ జీవులు సమభావముతోనూ ప్రేమ దృష్టితోనూ మెలగుదురు గాక. లోకములన్నియు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లును గాక." అనే వాక్యాలు నిత్య సత్యాలుగా నిలుస్తాయి. ఇంతకు మించిన సోషలిజం ఎక్కడ ఉంటుంది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి