11, మార్చి 2015, బుధవారం

గుణాలపై విజయం

మనం ఎవరినైనా జయించాలంటే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళ బలాలేమిటో, బలహీనతలేమిటో కనిపెట్టాలి. మరి మనలోనే ఉన్నగుణాలను జయించాలంటే వాటి గురించి కూడా మనం ముందుగా తెలుసుకోవాలి కదా. భగవద్గీతలోని 14, 17 మరియు 18వ అధ్యాయాలలో గీతాచార్యుడు ఈ మూడు గుణాలయొక్క స్వభావాన్ని వివిధ ఉదాహరణల ద్వారా చక్కగా వివరించటం జరిగింది.

మనం చేసే ప్రతి పని, మనలోని ప్రతి ఆలోచన, మనకున్న అన్ని లక్షణాలు ఈ మూడు గుణాలతో ప్రభావితమై ఉంటాయి. అందుకే యజ్ఞం, దానం, తపస్సు, ధైర్యం, శ్రద్ధ, అవగాహన, ఆహారం, కర్మలు - ఇలా ప్రతి ఒక్క దాన్ని తీసుకుని అవి సత్వరజస్తమో గుణాలలో ఒక్కొక్క దానిచేత ప్రేరేపించబడినప్పుడు ఏ ఏ విధంగా ఉంటాయో చాలా వివరంగా చెప్పబడింది. వీటన్నిటినీ గమనిస్తే మనకి అన్నిట్లో ఈ గుణాలయొక్క సహజ లక్షణాలు కొంతవరకు అర్థమవుతాయి.

తమోగుణం:

తమోగుణ ప్రధానులైన వారిలో మనం ముఖ్యంగా గమనించతగిన లక్షణం తాము ఏమి చేస్తున్నామో, ఆ పనిని ఎలా చేయాలో, ఆ పని చేస్తే వచ్చే ఫలితమేమిటో ఏమీ తెలియకుండా ఏదో చేసాంలే అనే రీతిలో చేయటం, ఎదుటివారు ఏమి చెప్పినా దానిని తలక్రిందులుగా(విపరీతార్థంలో) అర్థం చేసుకోవటం. ఈ లక్షణానికి ప్రధాన కారణం అజ్ఞానం, సోమరితనం. నిజానికి ఇవి రెండూ వేరువేరని మనం అనుకుంటాం కానీ మా గురుదేవులు సోమరితనమే అజ్ఞానం అని చెప్పేవారు. 

రజోగుణం:

రజోగుణ ప్రధానులైన వారికి ఏ పని ఎలా చేయాలో బాగానే తెలుసు. విషయాలన్నీ బాగానే అర్థం అవుతూ ఉంటాయి. చేసే పనులన్నీ శ్రద్ధగా తప్పులు లేకుండా కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు చేసే ప్రతి పని వెనుక స్వార్థం దాగి ఉంటుంది. ఏదైనా ప్రతిఫలాన్నో, పుణ్యాన్నో, పేరు ప్రతిష్టలనో ఆశించి చేస్తూ ఉంటారు.

సత్వగుణం:

ఇక సత్వగుణ ప్రధానులైనవారు తాము చేసే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తారు. కానీ ఏ పనికీ వీరు ప్రతిఫలాన్ని ఆశించరు. శాస్త్రము లేదా గురువులు, పెద్దలు నిర్దేశించిన విధంగా ఆయా కర్మలను తమ కర్తవ్యంగా భావించి నిరంతరాయంగా చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ దీనివలన నాకేంటి అని కాని, ఫలితంలేని పనులను ఎన్నాళ్ళు చేస్తాం అని కాని ఆలోచించరు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా, కేవలం భగవంతుడు తమతో చేయిస్తున్నాడనే భావనతో, అత్యంత శ్రద్ధా భక్తులతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. అలాగే గురువులు, పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆచరణలో పెడతారు.

కనుక మనం ముందుగా తమోగుణాన్ని జయించాలంటే సోమరితనాన్ని వదలిపెట్టి, గురువులను, పెద్దలను ఆశ్రయించి ఏ పని ఎలా చెయ్యాలో శ్రద్ధగా తెలుసుకోవాలి. మా గురుదేవులైతే ఏ వంట ఎలా చెయ్యాలి అన్న దానినుంచి ఏ పదార్థాన్ని ఎలా తినాలి అన్న దానివరకు, మొక్కలు ఎలా పెంచాలి అన్న దానినుండి, పూవులు ఎలా కోయాలి, అవి భగవంతునికి ఎలా అలంకరిచాలి అన్నదాని వరకు ఇలా జీవితంలో ప్రతి విషయంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి - ఇలా ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా నేర్పించేవారు.

ఇలా నేర్చుకున్న విషయాలను ముందుగా ప్రతిఫలమో, పుణ్యమో, పేరు ప్రతిష్టలో ఆశించి అయినా సరే శ్రద్ధగా ఆచరించటం అలవాటు చేసుకోవాలి. ఇలా రజోగుణ సహాయంతో తమోగుణాన్ని జయించవచ్చు. ఇక ఆ తరువాత మనం ఆశించిన ప్రతిఫలమో, పుణ్యమో, పేరు ప్రతిష్టలో మనకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తున్నాయి, ఎంత కాలం నిలిచి ఉంటున్నాయి అని విచారణ చేయటం ద్వారా, వాటి అశాశ్వతత్వాన్ని చక్కగా తెలుసుకోవటం ద్వారా, రజోగుణాన్ని దాటి సత్వగుణ ప్రధానులమై నిష్కామ కర్మాచరణం అలవర్చుకోగలం.

ఇలా కర్తృత్వ భావన లేకుండా, ఎట్టి ఫలితాన్ని ఆశించకుండా కేవలం భగవదాదేశం ప్రకారం కర్మలు చేస్తూ, అవికూడా ఆయనే చేయిస్తున్నాడు తప్ప నేను కేవలం ఒక పనిముట్టునే అనే భావనతో పనులు చేయటం కర్మలో అకర్మ అనబడుతుంది. తద్వారా మనకు ఎట్టి కర్మ ఫలాలు అంటక చివరికి ఈ జన్మ పరంపర నుంచి మోక్షం సిద్ధిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి