ప్రస్తుతం నా బ్లాగును చదువుతున్న నా సహాధ్యాయులు MCA లో ఉండగా నేను ఇంతగా
మాట్లాడలేదని, నా ఈ భావాలూ వ్యక్తం చెయ్యలేదని దానికి కారణాలు అడుగుతున్నారు. నాకు
తెలిసి దానికి కారణం ఒక్కటే - ర్యాగింగ్ అని పిలువబడే రాక్షస క్రీడ.
దీనిని రాక్షస క్రీడ అని ఎందుకు అంటున్నానంటే మనుష్యులు నాలుగు రకాలు. తమకు
కష్ట నష్టాలు కలిగినా ఎదుటివారికి సంతోషం కలిగించే వారు మహాత్ములు. తమకు నష్టం
లేనంతవరకు ఎదుటివారికి మేలు చేసేవారు మంచివారు. తమ లాభం కోసం ఎదుటివారికి అపకారం
చేసేవారు దుష్టులు. తమకు ఎట్టి లాభం లేకపోయినా, చివరికి తమకి నష్టం జరిగిన సరే, ఎదుటివారిని కష్టపెట్టి పైశాచిక
ఆనందం పొందేవారు రాక్షసులు.
అసలే బెరుకు బెరుగ్గా కళాశాలలో అడుగు పెట్టిన నేను, సీనియర్లు అని పిలువబడే మా
కన్నా ఒక సంవత్సరం ముందు చేరిన వారి చర్యలను చూసి భయపడటం మొదలుపెట్టాను. రెండో
రోజునుంచి వంచిన తల ఎత్తే పరిస్థితి లేదు. ఇలా కొన్ని నెలలపాటు అనుభవించాల్సి వచ్చింది. ఠాగూర్ చెప్పినట్లు ఎక్కడ మనస్సు భయం
లేకుండా ఉంటుందో, ఎక్కడ మనిషి తల ఎత్తుకుని నిర్భయంగా జీవించగలడో అక్కడ మాత్రమే
అతడి మనో వికాసానికి అవకాశం ఉంటుంది.
కేవలం ఒక సంవత్సరం ముందు చేరినంత మాత్రాన వేరొకరి మనోభావాలను దెబ్బతీసే
అధికారం ఎవరికీ లేదు. అంతే కాదు. సున్నిత మనస్కులపై ఈ ప్రభావం ఎంతో కాలం ఉంటుంది.
ఇప్పటికీ హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ర్యాగింగ్ దృశ్యాలు చూసినప్పుడు నా రక్తం
మరిగిపోతుంటుంది.
నిజానికి నా సహాధ్యాయులకి ఈ విషయాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు. ఇతర
వృత్తివిద్యా కళాశాలలతో పోలిస్తే, యాజమాన్యం పుణ్యమా అని, మా కళాశాలలో ర్యాగింగ్
స్థాయి చాలా తక్కువే. కానీ ఆ మాత్రం దానికే నాపై ఇంత ప్రభావం పడిందంటే, ఇక పూర్తి
స్థాయి ర్యాగింగ్ కు గురయ్యే వారిపై ఇంకెంత ప్రభావం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇది
చదివిన ఒక్కరైనా కనీసం ఒకరిని ఈ వికృత క్రీడకు గురి కాకుండా రక్షించగలిగితే నా ఈ
శ్రమ సార్థకమైనట్లే.