17, ఫిబ్రవరి 2025, సోమవారం

శ్రీ కాళీవనాశ్రమం


అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా
ప్రత్యక్షో గురు రూపేణ వర్తే భక్తి సిద్ధయే

    భౌతికంగా మన కంటికి కనిపించని మహాదేవుడు తన భక్తుల భక్తిని సిద్ధింపజేయడానికి గురు రూపంలో ప్రత్యక్షమవుతాడని మన సనాతన ధర్మం బోధిస్తోంది. మన పవిత్ర భారతావనిలో యుగయుగాలుగా శ్రీ దక్షిణామూర్తి, దత్తాత్రేయులు, వశిష్ఠులు, వేదవ్యాసులు, శుకమహర్షి వంటి ఎందరో గురువులు అవతరించి మానవాళికి భగవంతుని చేరుకునే సులభమైన మార్గాన్ని ఉపదేశించి, మానవ జీవిత చరమ లక్ష్యమైన ముక్తిని పొందింపజేశారు. ఇక ఈ ఆధునిక కాలంలో కూడా శ్రీ ఆది శంకరాచార్యులు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, రాఘవేంద్రస్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, భగవాన్ రమణమహర్షి, శిరిడీ సాయిబాబా, మలయాళస్వామి వంటి ఎందరో సద్గురువులు ఈ గడ్డపై అవతరించారు. అందుకే మన భారతదేశం ‘రత్నగర్భ’ అని కీర్తింపబడింది. వారి కోవకు చెందినవారే సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్.

    శ్రీ బాబూజీ ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు అవతరించారో ఎవరికీ తెలియదు. పసిప్రాయంలోనే కఠోర ఆధ్యాత్మిక సాధన చేసి సిద్ధిని పొందారు. సుమారు 1930 ప్రాంతాలలో ఉభయ గోదావరి జిల్లాలలోని ఉప్పాడ, యనమదుర్రు, భీమవరం, గుండుగొలను, అలాగే గుంటూరు ప్రాంతంలో కూడా తమకు తాముగా భక్తులకు ప్రకటితమై, వారి వారి ఇండ్లకు తరచుగా వస్తూ, వారి సమస్యలను తీరుస్తూ, వారిలో ఆధ్యాత్మిక భావనలను నెలకొల్పారు. ఆ కాలంలో ఆచరణలో ఉన్న కులభేదాలు, అంటరానితనం వంటి దురాచారాలను, మతం పేరిట ప్రబలంగా ఉన్న అనేక మూఢనమ్మకాలను రూపుమాపటానికి విశేష కృషి చేశారు. సత్యం, శాంతి, దయ, ప్రేమలే తమ ఆధ్యాత్మిక బోధనలకు మూలస్తంభాలుగా చేసుకొని, మానవునికి మానవునికి మధ్య గల భేదబుద్ధిని తొలగించి పరస్పర ప్రేమను సమభావనను నెలకొల్పారు.

    అణిమాది అష్టసిద్ధులు తమ సొంతమైనా ఏనాడూ వాటిని తమ స్వార్థంకోసం కానీ, పేరుప్రతిష్టల కోసం ఉపయోగించక కేవలం ఆర్తులను, ఆపదలో ఉన్నవారిని ఉద్ధరించడానికి మాత్రమే ఉపయోగించేవారు. అలా వారివలన ఆపదలనుండి రక్షణ పొందినవారు, వైద్యులచే మరణించారని నిర్ధారణ జరిగిన తరువాత తిరిగి బ్రతికినవారు ఎందరో ఉన్నారు. వారికి ప్రచారం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ‘నేను ఆధ్యాత్మిక గురువును కాబట్టి మీ సాంసారిక సమస్యలతో నాకు సంబంధం లేదు’ అని వారు ఎన్నడూ అనలేదు. వారు బోధించే శుద్ధ అద్వైత తత్వం బోధపడాలంటే ముందు ఆ మానవుడి కడుపు నిండాలి, అతనిని అశాంతికి గురి చేస్తున్న సమస్యలు తీరాలి అని వారు బలంగా విశ్వసించారు. అందుకే ముందుగా వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపి, ఆ తరువాత మెల్లగా వారిని ఆధ్యాత్మికత వైపుకు మరలించేవారు.

    ఒక్కసారి శ్రీ బాబూజీని ఆశ్రయించి వారి వాత్సల్యాన్ని చవిచూసినవారు కుటుంబ సమేతంగా, తరతరాలుగా వారిని విడువక ముక్తిమార్గంలో పయనం కొనసాగించారు. అలా శ్రీ బాబూజీ శిష్యులందరూ మనోపరివర్తన చెంది కులమతాలకతీతంగా అందరూ ఒకే కుటుంబంగా మెలగుతున్న సమయంలో వివిధ ప్రాంతాలలో ఉన్న తామందరము ఒకే చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఉంటే అది తమ ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని గాఢంగా విశ్వసించి మరీమరీ ప్రార్థించిన మీదట 1972 మే 31న శ్రీ కాళీవనాశ్రమం(శ్రీ కాళీ గార్డెన్స్) గుంటూరు విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన, నంబూరు రైల్వేస్టేషనుకు ఎదురుగా ఏర్పడింది.

    భక్తులందరూ గృహస్థాశ్రమాన్ని అవలంబిస్తూ కుటుంబ సమేతంగా ఇక్కడ జీవించడం ఈ ఆశ్రమం ప్రత్యేకత. సన్యాసాశ్రమం బహు కష్టతరమైనదని, గృహస్తుగా ఉంటూనే గురువులు చూపిన మార్గంలో సాధన చేస్తే తప్పక తరించవచ్చుననేది శ్రీ బాబూజీ సిద్ధాంతం. శ్రీ బాబూజీ హస్తాలలో స్వయంభువుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి, దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారిచే పూజలందిన మూర్తిని పోలియున్న శ్రీ కాళికాపరమేశ్వరి ఆలయాలు, శ్రీ కోదండరామ, రాధాకృష్ణ ఆలయాలు ఈ ఆశ్రమంలో దర్శించవచ్చు.

    విశ్వశాంతికై మూడు యాగాలను కూడా శ్రీ బాబూజీ ఇక్కడ నిర్వహించారు. ఆశ్రమ పరిసర గ్రామాలైన పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజ మొదలైన గ్రామలలోని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయటానికై పాఠశాలను, వైద్యశాలను కూడా నిర్మించారు. ఇవి రెండూ అతి తక్కువ ఖర్చుతో, అర్హులైనవారికి ఉచితంగా విద్య వైద్య సదుపాయాలను అందిస్తున్నాయి. ఇలా మానవాళికి భౌతిక, ఆధ్యాత్మిక సేవలు అందించడానికి ఒక మహత్తర సంస్థను ఏర్పరచి శ్రీ బాబూజీ 1988 డిశెంబర్ 3వ తేదీన తమ అవతారాన్ని చాలించారు. వారి మహాసమాధి శ్రీ బృందావనంగా ప్రఖ్యాతిగాంచి ఆశ్రమంలో ప్రముఖ దర్శనీయ క్షేత్రం అయ్యింది.

    అనంతరం శ్రీ బాబూజీ ప్రియశిష్యులైన యోగినీ శ్రీ చంద్ర కాళీప్రసాద మాతాజీ ఆశ్రమ బాధ్యతలను చేబట్టి గురుదేవుల బోధలను దేశదేశాంతరాలలో ప్రచారం చేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. ఆశ్రమానికి హైదరాబాదు, పెదనిండ్రకొలను, గుండుగొలను, బెంగళూరు, భీమవరం తదితర ప్రాంతాలలో శాఖలను ఏర్పరచి, అనేక యజ్ఞయాగాదులను, ఉచిత ఆన్నదాన పథకాన్ని, వయోవృద్ధులకు ఆశ్రిత ఆశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి, మహాశివరాత్రి, ధనుర్మాసం, భోగి, సంక్రాంతి, కార్తీకమాసంలో వచ్చే శ్రీ బాబూజీ వారి ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతాయి. గురుదేవుని సర్వదేవతా స్వరూపులుగా భావించి, ప్రతి పండుగకు, తమ జీవితాలలో జరిగే ప్రతి శుభాశుభ సంఘటనల సందర్భంగాను భక్తులు శ్రీ గురుపూజను నిర్వహిస్తారు.

    దసరా ఉత్సవాలలో పంచిపెట్టే మంత్రపూతమైన అక్షతలు, జగన్మాత పూజాకుంకుమ, భోగినాడు శ్రీగురుదేవులకు అభిషేకించి పంచిపెట్టే భోగిపళ్ళు, నాణేల కోసం విశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే శ్రీ రామలింగేశ్వరాలయంలో కులమతాలకతీతంగా భక్తులు గర్భాలయంలో ప్రవేశించి, స్వామిని తాకి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే ఆశ్రమంలోని ఆలయాలన్నింటిలో అనేకమంది స్త్రీలు అర్చకులుగా, సహాయకులుగా, పురోహితులుగా సేవలు అందిస్తూ ఉంటారు. ఇలా కుల, లింగ, వర్ణాశ్రమ భేదాలకతీతంగా సర్వులూ భగవత్సేవకు, ఆధ్యాత్మిక సాధనకు, ముక్తిని పొందటానికి అర్హులేనని నిరూపిస్తోంది శ్రీ కాళీవనాశ్రమం.

3, ఫిబ్రవరి 2025, సోమవారం

బాలకృష్ణుడు - బాబు

 

    సమర్థ సద్గురుదేవులు శ్రీశ్రీశ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారు కొన్ని దశాబ్దాల పాటు సంచరించి, ఎందరో భక్తులను ఉద్ధరించి, తమ చరణధూళితో పవిత్ర క్షేత్రంగా మలచిన భీమవరంలో శ్రీ కాళీవనాశ్రమ శాఖను ఏర్పరచుకొని బృందావనం, ఇతర ఉపాలయాలు, అన్నదాన, వసతి భవనాలను నిర్మించుకొని ప్రారంభించుకొంటున్న సందర్భంగా శ్రీబాబు దివ్య లీలలను కొన్నింటిని గుర్తు చేసుకొందాం. శ్రీబాబుతో భీమవరంలో సన్నిహితంగా గడిపిన వారందరూ అనే మాట అప్పటి రోజులు శ్రీకృష్ణుడు బృందావనంలో గడిపిన రోజులలాంటివని. అందుకే శ్రీబాబును బాలకృష్ణుడితో పోల్చి ఆ ఆనందాన్ని అందుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నం.

    కంసుని బాధల నుండి విముక్తి కొరకు భూదేవి, ఇతర దేవతలు ప్రార్థించగా నారాయణమూర్తి శ్రీకృష్ణావతారం ధరించాడు కదా! కంసుడు అంటే ఆత్మ సుఖానికి అడ్డుపడే పూర్వ వాసన అని అర్థం చెబుతారు. గొప్ప ఆధ్యాత్మిక సాధకులై భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగిన వారు, లేదా అటువంటి వారి కుటుంబంలోని వారు కూడా మోక్షఫలాన్ని అందుకోలేకుండా అడ్డుపడుతున్న కులమతాల అంతరాలు, అంటరానితనం, మూఢాచారాలు మొదలైన వాసనలను తొలగించి మోక్షమార్గాన్ని నిష్కంటకం చేయడానికి అవతరించారు శ్రీబాబు. శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భాన పుట్టాడని చెప్పుకుంటాం కానీ ఆయన నిజంగా పుట్టాడా? అంటే లేదనే సమాధానం. చతుర్భుజాలతో, శంఖచక్రాది ఆయుధాలతో ఆయన కనిపించాడు. అంతేకానీ దేవకి ప్రసవ వేదన పడలేదు. అందుకే అన్నమయ్య 'నవ్వుచు దేవకి నందను కనియె' అంటాడు. ఎప్పుడెప్పుడు ధర్మరక్షణకు అవసరమైతే అప్పుడప్పుడు నా మాయను తోడు చేసుకొని నేను అవతరిస్తూ ఉంటానని స్వామి చెప్పారు కదా! అలాగే శ్రీబాబు కూడా ఏ తల్లిదండ్రులను నిమిత్తమాత్రంగా చేసుకొని ఈ పుణ్యభూమిలో అవతరించారో ఎవరికీ తెలియదు.

    శ్రీకృష్ణుడు అవతరించడానికి ఎంతో ముందుగానే ఆకాశవాణి ఆ వార్తను కంసునికి సూచించినట్లుగానే శ్రీబాబు వారికి దర్శనం ఇవ్వడానికి చాలా సంవత్సరాల ముందుగానే శ్రీ కందర్ప పరశురామయ్యగారికి, శ్రీ కలిదిండి నరసింహరాజుగారికి, శ్రీ చల్లా కృష్ణమూర్తిగారికి, కోటిపల్లి మామ్మగారని పిలువబడే శ్రీమతి శేషమాంబగారికి వారివారి ఆరాధ్య దైవాల రూపంలో స్వప్నదర్శనం ఇచ్చి తాము వారి మధ్యకు రాబోతున్నామని తెలియజేశారు.

    దేవకీ వసుదేవులకు అవతరించిన శ్రీకృష్ణుడు తనను పెంచి పెద్దచేసే మహద్భాగ్యం మాత్రం యశోదమ్మకు అనుగ్రహించాడు. అలాగే శ్రీబాబు ముందు కొంతకాలం ఒక కోయ దంపతుల వద్ద పెరిగి, ఆ తరువాత ఉప్పాడలోని సత్యవతమ్మగారికి యశోదమ్మకు అనుగ్రహించిన మహద్భాగ్యాన్నే అనుగ్రహించారు. శ్రీకృష్ణుడు ఒక్కసారి బృందావనాన్ని విడిచి మధురకు వెళ్ళిన తరువాత మళ్ళీ యశోదమ్మ దగ్గరకు తిరిగి రాలేదు. అలాగే ఒక్కసారి ముంజవరపుకొట్టు వెళ్ళిన శ్రీబాబు మళ్ళీ ఉప్పాడకు తిరిగి రాలేదు.

    ఒకనాడు తనకోసం తృణావర్తుడు వస్తున్నాడని తెలిసి యశోదమ్మ ఒడిలో పడుకుని ఉన్న కృష్ణయ్య ఒక్కసారిగా ఆవిడ మోయలేనంత బరువెక్కిపోయాడు. ఇదే లీల శ్రీబాబు శ్రీ చల్లా కృష్ణమూర్తిగారికి చూపించారు. శ్రీబాబు నవయవ్వనంలో చాలా సన్నగా ఉండేవారు.  కృష్ణమూర్తిగారు నడివయసులో భారీ కాయంతో ఉండేవారు. అయితే వారు శ్రీబాబుచే నాన్నగారని పిలిపించుకొన్న శ్రీ కందర్ప పరశురామయ్యగారి అల్లుడు కావడంతో శ్రీబాబుతో బావ బావమరదుల వంటి సాన్నిహిత్యం, చనువు ఉండేది. ఆ చనువుతో ఒకసారి భీమవరంలో ఆయన శ్రీబాబు కుర్చీలో కూర్చొని ఉండగా వచ్చి వారి ఒడిలో కూర్చొని తన బరువునంతా శ్రీబాబుపై వేసి ఉడికించాలని చూశారు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా శ్రీబాబు ముఖంలో చిరునవ్వే కానీ బరువు మోస్తున్న శ్రమ ఏమాత్రం కనపడలేదు. ఇక లాభంలేదని ఆయన లేచి వేరొక కుర్చీలో కూర్చోగానే శ్రీబాబు వెళ్ళి ఆయన ఒడిలో కూర్చున్నారు. 'ఆ! ఈ బక్కపలచని ఆయన ఏం బరువుంటారు లే!' అని భావించిన ఆయనకు పదునాలుగు భువనాలు ఒక్కసారి వచ్చి తన ఒడిలో కూర్చున్నంత తీవ్రమైన బాధ కలిగింది. ఆ బరువు మోయలేక విలవిలలాడారు.

    శ్రీబాబు భీమవరం తాతయ్య(శ్రీ పాలూరి శ్రీరామమూర్తి)గారి ఇంటిలో ఉన్న రోజుల్లో శ్రీ చల్లా కృష్ణమూర్తిగారి కుటుంబం వారి ఎదురింటిలోనే ఉండేవారు. శ్రీకృష్ణుడు ఎలాగైతే అత్తాకోడళ్ళ మూతులకి వెన్నలు పూయడం, నిద్రిస్తున్న తాతల పిలకలను దూడల తోకలకు కట్టి పరిగెత్తించడం వంటి చిలిపి లీలలు చేసేవాడో శ్రీబాబు కుడా వారి కుటుంబాలతో అలాంటి లీలలే చేసేవారు. తాము ఎంతటి మహాత్ములయినా ఆ కుటుంబంలోని సాధారణ వ్యక్తి వలెనే అందరితో కలిసిపోయేవారు. బాలకృష్ణుడు తన నోటిలో బ్రహ్మాండాన్ని అంతటినీ యశోదకు చూపించినట్లుగానే శ్రీబాబు 'అమ్మా' అని పిలిచే పాలూరి సీతమ్మగారికి, శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారికి దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. ఒకరోజు శ్రీబాబు దేవతార్చన చేసుకుంటున్న సమయంలో గుమ్మం వద్ద కూర్చున్న సీతమ్మగారికి భూమి నుండి ఆకాశం వరకు వ్యాప్తమైన తెల్లని కాంతిపుంజం కనిపించి, అందులో వటపత్రశాయి అయిన బాలకృష్ణుడు, శ్రీబాబు మార్చి మార్చి కనిపించారు. అంతలోనే ఆ దృశ్యం మాయమై ప్రపంచము, పట్టణాలు, మేడలు, బజార్లు, రంగులరాట్నాలు, కొట్లు, ఇళ్ళు, తీర్థాలు, సముద్రాలు, పర్వతాలు కనిపించాయి. బాలకృష్ణుని సంకల్పంతోనే ప్రపంచమంతా పుట్టిందని, శ్రీబాబే బాలకృష్ణుడని ఆమెకు దివ్య స్ఫురణ కలిగింది. అలాగే ఒకసారి కోటప్పకొండలో శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారికి శ్రీబాబు స్థానంలో తెల్లని వెలుగు గది అంతా వ్యాపించి అందులోనుండి మూడు రంగుల కాంతి పుంజాలు, వాటిలోనుండి త్రిమూర్తులు దర్శనమిచ్చి తిరిగి అంతా శ్రీబాబులోనే లీనమైపోయినట్లు దివ్య అనుభూతి కలిగింది.

    శ్రీకృష్ణుడు అఘాసురుని నోటిలో పడిన, మరొకసారి దావానలంలో చిక్కుకొన్న గోపబాలురను అందరినీ రక్షించినట్లుగానే శ్రీబాబు సుడిగుండంలో చిక్కుకున్న భక్తులను అనేకసార్లు రక్షించారు. తెల్లవారుజాము అనుకొని పొరబడి అర్థరాత్రి వేళ నదిలో స్నానానికి వెళ్ళి వరుణ భటుని చేతిలో చిక్కి వరుణలోకానికి వెళ్ళిపోయిన నందుని, సముద్రంలో తీర్థ స్నానానికి వెళ్ళి పంచజన్యుని నోట చిక్కి యమపురికి చేరిన గురుపుత్రుని శ్రీకృష్ణుడు రక్షించి తిరిగి తీసుకువచ్చినట్లుగానే మరణించి వైకుంఠానికి చేరిన కుమారి ఇందిరాదేవి గారిని, శ్రీ కొప్పెర్ల వెంకటరాజు (నిండ్రకొలను డాక్టరు) గారిని శ్రీబాబు మళ్ళీ పునర్జీవితులను చేశారు. అలాగే ఎందరో భక్తులకు దీర్ఘ రోగాలను నయంచేసి ఆయుష్షును పెంచారు. శ్రీకృష్ణుడు గోపాలురకు రాక్షస బాధను తొలగించినట్లుగానే ఎందరో భక్తులకు గ్రహబాధలు తొలగించారు.

    మన దగ్గర ఏమున్నా పదిమందికీ పంచిపెట్టి అందరమూ కలిసి అనుభవించాలి కానీ ఒక్కరే దాచుకొని తినడం ఆ పరమాత్మకు నచ్చదు. అందుకే బాలకృష్ణునితో పాటు దూడలను కాయడానికి వెళ్ళిన గోపబాలురు అందరూ  స్వామితో కలిసి కూర్చొని వారు వారు తెచ్చుకొన్న పదార్థాలు అందరితో సమానంగా పంచుకొని ఆరగించవలసిందే. గోపికలు పంచిపెట్టకుండా అమ్ముకోవడానికై ఉట్టి మీద దాచిన పెరుగు వెన్నలు బాలకృష్ణుడు దొంగిలించి పిల్లలందరికీ పంచిపెట్టేవాడు. అలాగే శ్రీబాబు కూడా ఆయా గ్రామాలలో వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు, లేదా ఎవరి ఇంటికైనా అతిథులుగా వెళ్ళినప్పుడు ఇంటివారు లోపల లోపల దాచిన తినుబండారాలన్నీ చెప్పి మరీ బయటకు తీయించి అందరికీ పంచిపెట్టేవారు. 

    మునులు యజ్ఞం కోసం ఎంతో ఆర్భాటంగా అన్ని సంబారాలను సమకూర్చుకొన్నా వచ్చినవాడు యజ్ఞ పురుషుడని గ్రహించలేకపోయారు. వారి పత్నులు మాత్రం సత్యాన్ని గ్రహించి పరుగుపరుగున వచ్చి గోప బాలకులతో కూడి ఉన్న బాలకృష్ణునికి తాము వండిన పదార్థాలన్నీ సమర్పించుకుంటే ఆ స్వామి వాటిని ఎంతో ఆప్యాయంగా ఆరగించాడు. అలాగే తన భార్యలు పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేసినా కుచేలుడు తెచ్చిన అటుకులను ప్రేమగా ఆరగించాడు. అలాగే శ్రీబాబు ఆర్భాటంగా సంపన్న భక్తులు సమర్పించిన ఫలహారాలను దృష్టిమాత్రంగానే స్వీకరించేవారు కానీ ఆర్తితో ఏ పేదరాలో తెచ్చిన ఇన్ని అటుకులో, బఠాణీలో, తేగలో ప్రేమతో స్వీకరించి, అందరికీ మహాప్రసాదంగా పంచిపెట్టేవారు.

    గోపికలు బాలకృష్ణుని కోసం వీధి గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటే ఆయన దొడ్డిగుమ్మం నుంచి దొంగచాటుగా వచ్చినట్లు ఒకసారి శ్రీబాబు పాందువ్వ గ్రామంలో ఏర్పాటు చేసిన సత్సంగానికి రాజమార్గంలో వెళ్ళకుండా దారిలో ఉన్న ఇళ్ళలో ఒక ఇంటి దొడ్డిలో నుండి మరొక ఇంటి దొడ్డి గుమ్మం లోనికి ఇలా నడుచుకుంటూ వెళ్ళారు.  

    నందుడు మొదలుగా గల గోపాలురు అందరూ ప్రతి సంవత్సరం మంచి వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఇంద్రయాగం చేసేవారు. కానీ బాలకృష్ణుడు మనిషి సుఖదుఃఖాలకు అతడు చేసే కర్మమే కారణం కానీ ఇంద్రాది దేవతలు కాదని, ఇంద్రుని పూజించడం కంటే వారి గోవులకు గడ్డిని అందిస్తున్న గోవర్ధన గిరిని పూజించడం ఉత్తమమని బోధించి ఆచరింపజేశాడు. అలాగే శ్రీబాబు బ్రహ్మకపాలంలో పితృదేవతలకు పిండప్రదానం చేయ సంకల్పించిన భీమవరం తాతయ్యగారికి ఆ పిండాలు అక్కడి పండాల బ్రతుకుతెరువు కోసమేనని, అవి పితృదేవతలకు ఖచ్చితంగా చేరతాయని వారుకూడా చెప్పలేరని ఆ పండాలతోనే  నిరూపింపజేసి మాన్పించారు. సాటి మనిషిని మనిషిగా గుర్తించి భక్తితో చేసుకొన్న మానవసేవే మాధవునికి నిజంగా చేరుతుందని బోధించారు. అప్పటివరకు తమ పొలంలో పనిచేసే మహంకాళి అనే హరిజనుని తమ ఇంటి చాయలకు కూడా రానీయని తాతయ్యగారు ఒకనాడు అతనిని ఇంటి లోపలకు పిలిచి తమ ప్రక్కన కూర్చుండబెట్టుకొని భోజనం చేయిస్తే శ్రీబాబు ఎంతగానో సంతోషించారు. అలాగే ఆ కుటుంబం, ఇంకా శ్రీవారిని ఆశ్రయించిన ఎన్నో కుటుంబాలలో అప్పట్లో ఉన్న మడి, ఆచారాలను, అంటరాని తనాన్ని రూపుమాపి సృష్టి అంతా జగన్మాత సంతానమే అని, ఇందులో తారతమ్యాలు చూడరాదని నేర్పించి వారిలో గొప్ప మార్పును తీసుకొచ్చారు.

    అలాగే తమ ఆత్మరక్షణ కోసం శూలినీ దుర్గ ఉపాసన చేసి శక్తులను పొందాలని ప్రయత్నిస్తున్న శ్రీ పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్ గారిని వారించి, ఆయన రక్షణ భారం అంతా తామే వహించి వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించారు. చిన్న వయసులోనే ఇంటిని విడిచి హిమాలయాలకు వెళ్ళిపోయిన శ్రీ విఠాల కామయ్య శాస్త్రిగారికి వృద్ధ తాపసి రూపంలో దర్శనమిచ్చి గృహస్థుగా ఉంటూనే తరించవచ్చని, అదే నిరపాయమైన మార్గమని ఉద్బోధించి వెనక్కి పంపించారు. వారు వివాహితులై, సంతానాన్ని పొందిన చాలా సంవత్సరాల తరువాత బాలబాబు రూపంలో మళ్ళీ దర్శనమిచ్చి ఆ రోజు తాము సూచించిన మార్గంలో ప్రయాణం ఎంత చక్కగా సాగుతున్నదో, ఆయన ఆధ్యాత్మిక సాధనలో పురోగతి ఎలా ఉన్నదో అడిగి తెలుసుకొని వారి కుటుంబాన్ని తమ శిష్యులుగా అనుగ్రహించారు.

    ఇంద్ర గర్వభంగం కోసం బాలకృష్ణుడు ఏడు రోజుల పాటు వర్షాన్ని కురవనిచ్చి అయినా తనను ఆశ్రయించిన వారికి ఎట్టి ఇబ్బంది లేకుండా గోవర్ధన గిరినెత్తి ఆ నీడలో వారిని కాపాడాడు కదా! అలాగే ఒకసారి శ్రీబాబు భీమవరం తాతయ్యగారు, ఇంకా మిగిలిన భక్తులతో కాకరపర్రు నుండి ర్యాలీ వెళుతుంటే ఒకప్రక్క తాతయ్యగారు ఆ ఎండకు తట్టుకోలేక వివిలలాడుతున్నారు. మరొకప్రక్క ఆ చుట్టుప్రక్కల పొలాలలోని రైతులు శ్రీబాబును చూసి 'బాబూ! ఈ సంవత్సరం ఇంతవరకూ వర్షాలు లేవు. పంటలు ఎండిపోతున్నాయ్. దయచేసి వర్షం కురిపించండి' అని ఆర్తితో ప్రార్థించారు. శ్రీబాబు 'అలాగే! అలాగే!' అని అభయమిచ్చి, 'తాతయ్యా! ఎండ తట్టుకోలేక పోతున్నావా?' అని ఆకాశం వంక చూశారు. వెంటనే ఆకాశంలో మబ్బులు పట్టి వాతావరణం చల్లబడింది. వీరందరూ తిరిగి కాకరపర్రులో తమ బసకు చేరుకోగానే కుంభవృష్టి మొదలై ఆ చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలో వారంరోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మరొకసారి శ్రీకాళీవనాశ్రమంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై అంతా చీకటిగా మారిపోయింది. భక్తులు భయపడుతుంటే శ్రీబాబు 'ఏం పరవాలేదు. మీరు భోజనాలు కానివ్వండి' అన్నారు. భక్తులు భోజనాలు చేస్తున్నంత సేపూ ఆశ్రమం కంచెకు అవతల కుంభవృష్టి కురిసింది కానీ, భక్తులమీద ఒక్క చుక్కైనా వాన పడలేదు.

    బ్రహ్మదేవుడు గోప బాలురను, ఆవు దూడలను దాచివేస్తే బాలకృష్ణుడు సంవత్సరం పాటు వారందరి రూపాలు ధరించి వ్యవహారం నడిపినట్లు శ్రీబాబు బ్రహ్మరాక్షసి బాధతో మరణదశకు చేరుకున్న కుమారి పావులూరి ఇందిరాదేవి గారిలో ప్రవేశించి వారి రూపంలో ఎంతోకాలం పాటు లెక్చరరుగా ఉద్యోగం చేశారు. రాజమండ్రి పేపరు ఫాక్టరీలో ఉద్యోగానికి వెళ్ళకుండా తమ దర్శనానికి వచ్చిన రెడ్డి కాళీప్రసాదును కాపాడటానికి అతని రూపంలో ఫాక్టరీకి వెళ్ళి ఎన్నాళ్ళుగానో బాగవ్వని యంత్రాన్ని బాగుచేశారు. శ్రీ గుండు నారాయణగారిని, వారి సోదరులు దీక్షితులు గారిని సంవత్సరం పాటు ఆశ్రమంలోనే ఉంచివేసినా, వారి వారి ఉద్యోగ స్థానాలలో ఎవరికీ వీరు లేని లోటే తెలియకుండా చూశారు.

    శ్రీకృష్ణుడు ఒక్కొక్క గోపికకు తాను ఒక్కొక్కడై అందరికీ కనువిందు చేశాడు. అలాగే శ్రీబాబు నరసాపురంలో మోహన్ లెనిన్ గారికి, ఏలూరులో ఆయన భార్య వేణమ్మ గారికి ఒకేసారి దర్శనమిచ్చి వారితో ఇంకా ఆయా గ్రామాలలోని భక్తులతో ఒకేసారి దీపావళి జరుపుకున్నారు. ఇంకోకసారి గుండుగొలనులో శ్రీ దేవి శరన్నవరాత్రులు జరుపుతూనే మొదటి మూడు రోజులు భీమవరంలో తాతయ్యగారి ఇంటిలో కూడా వారితో కలిసి ఉన్నారు. కుమారి ఇందిరాదేవికి తాతయ్యగారి ఇంటిలోనూ, బయటి బాత్రూము దగ్గరా ఒకేసారి దర్శనమిచ్చారు. శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారికి, ఇందిరాదేవికి, చంపకకు బాలకృష్ణునిగా తమ చుట్టూ వివిధ ఆకృతులలో ఒకేసారి దర్శనమిచ్చారు. 

    దిరుసుమర్రుకు చెందిన కొందరు ఆకతాయి యువకులు తమను అవమానించాలని ఎంతకాలంగానో ఎదురు చూస్తుంటే వారికి భీమవరంలో దర్శనమిచ్చి, వారితోపాటు మిలిటరీ హోటలుకు వెళ్ళి, వారు పెట్టిన పదార్ధాన్ని నిర్వికారంగా భుజించి, వారి ఎదుటే రైలు ఎక్కి వెళ్ళిపోయిన శ్రీబాబు ఆ యువకులు ఈ విషయం చెబుదామని దిరుసుమర్రు పరిగెత్తి కరణంగారు శ్రీ చాగంటి లింగమూర్తి గారి ఇంటి తలుపులు తడితే ఎదురుగా శ్రీబాబు! ఆరోజు ప్రొద్దున నుండీ శ్రీబాబు అక్కడే వారితో సంభాషిస్తూ భగవంతుని సర్వ వ్యాపకత్వం గురించి బోధిస్తున్నారని, కనీసం లఘుశంకకు కూడా లేవలేదని తెలుసుకొని ఆ యువకులకి కనువిప్పు కలిగింది. ఇలా శ్రీబాబు ఒకే సమయంలో వేరువేరు ప్రదేశాలలో భక్తులకు దర్శనమిచ్చిన సందర్భాలు కోకొల్లలు. 

    అర్ఘ్యం ఇవ్వడానికి యమునలో దిగిన అక్రూరునికి శ్రీకృష్ణుడు శేషశాయి అయిన నారాయణుడిగా దర్శనమిచ్చినట్లే నదీ, సముద్ర స్నానాలలో ఎందరో భక్తులకు శ్రీబాబు శేషశాయిగా దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు.

    తన భక్తుడైన అర్జునుని కాపాడటానికి శ్రీకృష్ణుడు రథసారధ్యం తానే చేసినట్లు శ్రీబాబు తమ భక్తులను ప్రమాదంనుండి కాపాడటానికి అనేకమార్లు కారు డ్రైవింగ్ తామే చేసి ఆ ప్రమాదాన్ని తమపైకే తీసుకున్నారు. ఇలా శ్రీబాబు లీలలు అనంతం. ఒక్క శ్రీకృష్ణుడనే ఏమిటి, ఏ దేవునితో పోల్చి చూసుకున్నా ఆ దేవునిలో శ్రీబాబు, శ్రీబాబులో ఆ దైవము తప్పక దర్శనమిస్తారు. ఎందుకంటే రూపాలు వేరైనా ఉన్న వస్తువు ఒక్కటే. అది మనం గుర్తించాలనే పరమాత్మ మాటిమాటికీ ఇన్నిన్ని అవతారాలు ఎత్తి మనకోసం ఇంతగా శ్రమపడుతున్నాడు. ఆ విషయాన్ని గుర్తించి, సన్మార్గంలో నడిచి, మన సాధనను పురోగమింపజేసుకొని, ఆ పరమాత్మలో లయం కావటమే వారి శ్రమకు మన వంతుగా తీర్చుకోగలిగిన రుణం.