8, జూన్ 2024, శనివారం

దానం

    దానానికి యజ్ఞము, తపస్సులతో సమానమైన స్థానాన్ని ఇచ్చింది భగవద్గీత. బ్రహ్మచర్యాది నాలుగు ఆశ్రమాలలో నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడూ మాత్రం మానడానికి వీల్లేదు అంటారు గీతాచార్యులు. మనుష్యులను పావనమొనర్చే శక్తి ఈ మూడింటికి ఉన్నదని కూడా చెప్పారు. అలాగే త్రిగుణాత్మకమైన మనస్సుతో కూడిన మానవుడు ఏ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఎటువంటి రీతిలో దానం చేస్తాడో కూడా చెప్పారు.

    అయితే అసలు దానం ఎలా ఇవ్వాలి? దాత మనస్థితి ఏవిధంగా ఉండాలి అని తైత్తిరీయ ఉపనిషత్తు నిర్వచిస్తోంది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం.

    శ్రద్ధయా దేయం - దానం ఇచ్చేవాడు శ్రద్ధగా ఇవ్వాలి. ఒక దానం అనే కాదు, ఏ పని చేసినా శ్రద్ధాభక్తులతో చేయమని మన ధర్మం బోధిస్తోంది. సాత్విక గుణం ప్రధానంగా కలిగినవాడు దేశ కాల పాత్రతలను ఎఱిగి, తనకు ఏమాత్రం తిరిగి ఉపకారం చేయలేని వ్యక్తులకు, దానాన్ని తన కర్తవ్యంగా భావించి చేస్తాడు అని భగవద్గీత బోధిస్తోంది. అదే తామసిక గుణ ప్రధానుడు అసలు ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేయాలో తెలియకుండా, దేశం, కాలం, పాత్రతలను చూడకుండా దానం చేస్తాడని చెబుతోంది. ఇక్కడే మనకి చేసేవారిలో శ్రద్ధ ఉందో, లోపించిందో అర్థం అయిపోతుంది.

    అశ్రద్ధయా దేయం - శ్రద్ధగా దానమివ్వాలని చెప్పిన మరుక్షణంలోనే ఉపనిషత్తు అశ్రద్ధగా దానమివ్వాలని చెబుతోంది. ఇది కొంచెం వింతగానే తోస్తుంది. అయితే ఇందులో అంతరార్థం ఏమిటంటే, ఒక్కసారి నువ్వు ఏదైనా వస్తువు దానమిచ్చావు అంటే, ఇక ఆ వస్తువుపై నీ మనసులో ఎటువంటి మమకారం ఉండకూడదు. ఎవరైనా మనకు చేసిన మేలును జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అదే మనం ఇతరులకు చేసిన మేలును వెంటనే మర్చిపోవాలి. ఉదాహరణకు మీ వీధి చివరన ఉన్న పేదవాడికి మీ బట్టలు ఇచ్చారనుకోండి. ఆ తరువాత అతను ఆ బట్టలు వేసుకొని కనిపించినప్పుడల్లా 'ఇవి నేనిచ్చిన బట్టలే కదా!' అనే భావన మీ మనసులో రాకూడదు. ఒక అన్నదాన సత్రానికి భూరి విరాళమిచ్చి ఆ మర్నాటినుండి మీ ఇంట్లో వంట మానేసి అందరూ అక్కడే తింటుంటే అది దానం ఎలా అవుతుంది? అలాగే ఒక గుడికో, బడికో స్థలమో, ధనమో దానమిచ్చి అక్కడ అంతా నా ఆధీనంలోనే ఉండాలి, నేను చెప్పినట్టే అన్నీ జరగాలి అని పట్టుబట్టేవాడు దాత ఎలా అవుతాడు? 

    అందుకనే దానమిచ్చిన ఆ క్షణంలోనే ఆ ద్రవ్యం మీద మనకు అశ్రద్ధ ఏర్పడాలి. దానితో ఎటువంటి సంగం పెట్టుకోకూడదు. ఒక్క కన్యాదానంలో తప్ప మిగిలిన అన్ని దానాలలో 'ఇదం న మమ' అని చెప్పిస్తారు. అంటే ఒకసారి దానమిచ్చిన వస్తువుతో ఇక నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. అయితే కుమార్తెను మాత్రం దానమిచ్చినా ఆమె ప్రేమానురాగాలపై మనకు హక్కు ఉంటుంది. ఆమెకు ఏ కష్టమొచ్చినా కలుగజేసుకొనే హక్కు ఉంటుంది. అయితే హక్కు ఉంది కదా అని ఏ తల్లిదండ్రులూ తమ కూతురి సంసారంలో నిరంతరం కలుగజేసుకోవాలని, ఆమెపై ఆధారపడాలని కోరుకోరు కదా! మరి హక్కు ఉన్న దానం విషయంలోనే ఇంత విరాగం ఉన్నప్పుడు, 'ఇది ఇంక నాది కాదు' అని చెప్పి దానమిచ్చిన వస్తువుపై శ్రద్ధాసక్తులు పెంచుకోవడం ధర్మం కాదు కదా! 

    ఎందరో అధర్మపరులైన రాజులను సంహరించి తాను పొందిన రాజ్యమంతా కశ్యప మహర్షికి దానమిచ్చేశానని, కనుక అత్యవసరమైనప్పుడే ఈ నేలపైకి వస్తానని, వచ్చినా చీకటి పడిన తరువాత తాను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేనని పరశురాముడు శ్రీరామునికి చెప్పడం మనం రామాయణంలో చూస్తాం. తనదైన వస్తువుని దానమిస్తేనే దానిమీద హక్కును వెంటనే పోగొట్టుకోవాలని మన ఆర్షధర్మం బోధిస్తూ ఉంటే అసలు తమది కాని ప్రజల సొమ్మును వారికే పంచిపెట్టి, దానిమీద తమ పేరు, బొమ్మ ముద్రించుకొనే వారి గురించి మాట్లాడుకోవటానికి ఏముంటుంది. అసలు ఇలాంటి వ్యక్తులు ఉంటారని గీతాచార్యులు కూడా ఊహించి ఉండరు. అందుకే సత్వరజస్తమో గుణ దాతల నిర్వచనంలో కూడా ఎక్కడా ఇటువంటి వారి ప్రస్తావన తేలేదు.

    శ్రియా దేయం - నీ స్తోమతకు తగిన రీతిలో నువ్వు దానం చెయ్యాలి. వెనకటికి ఒకడు తనకున్న సెంటు భూమిలో తోటకూర పండించి ఆ దారిన వచ్చేపోయేవారికి ఆ తోటకూర పంచిపెట్టేవాడు. అలా తనకున్న దానిలో అధికభాగం దానమిచ్చిన పుణ్యవశాన మరుజన్మలో అతడు రాజుగా పుట్టాడు. అయితే పూర్వజన్మ స్మృతి కూడా కొంత కలిగింది. 'ఆ జన్మలో కొద్దిగా తోటకూర దానమిచ్చి ఈ జన్మలో రాజునయ్యాను కదా! ఇప్పుడు చాలా తోటకూర దానమిస్తే ఇంకెంత గొప్ప జన్మ వస్తోందో!' అనుకొని ఎకరాల కొద్దీ తోటకూర పండించి దానమివ్వడం మొదలుపెట్టాడు. రాజుగారు తోటకూర దానమివ్వడమేమిటని లోకమంతా విచిత్రంగా చెప్పుకోవడం మొదలు పెట్టింది. ఒకనాడు ఒక మహాత్ములు అటుగా వెళ్తూ ఆ రాజును చూసి 'అంతకు ఇంతయ్యింది కానీ ఇక ఇంతకు ఇంతే!' అన్నారు. ఆ రాజుకు విషయం అర్థం కాక వివరించమని ఆ మహాత్ముని ప్రార్థించాడు. 'ఆ జన్మలో నువ్వు ఒక చిన్న రైతువి. నీ స్తోమతను బట్టి తోటకూర దానమిచ్చావు. ఆ పుణ్యవశాన రాజువయ్యావు. ఇప్పుడు రాజుగా మణిమాణిక్యాలు, రత్నరాశులు, అగ్రహారాలు దానమివ్వవలసిన స్థితిలో ఉన్న నువ్వు నీ స్తోమతను మరచిపోయి ఇంకా తోటకూరే దానమిస్తే అది నీకు ఎటువంటి ఉన్నతిని కలుగజేయదు' అని వివరించారు ఆ మహాత్ములు.

    హ్రియా దేయం - సిగ్గుతో దానమివ్వాలి. 'అయ్యో! ఇంతకు మించి ఇవ్వలేక పోతున్నానే' అని సిగ్గుపడుతూ దానమివ్వాలి తప్పితే 'నేను కాబట్టి ఇంత గొప్ప గొప్ప దానాలు చేస్తున్నాను. అందరూ నన్ను గౌరవించాలి' అనే డంబంతో, అహంకారంతో దానమివ్వకూడదు. పూర్వం సంత్ రహీమ్ అని గొప్ప భక్తుడు, కవి ఉండేవారు. ఆయన రోజంతా తన ఇంటి బయట కూర్చొని ఎంతో మందికి తనకున్న కొద్దిపాటి సంపదనంతా దానమిస్తూ ఉండేవారు. అయితే అలా దానమిచ్చేటప్పుడు తల వంచుకొని సిగ్గుపడుతూ దానమిచ్చేవారు. ఒకసారి ఈ విషయం తులసీదాసు వారికి తెలిసి 'చేసేది మంచి పని అయినప్పుడు తల ఎత్తుకొని చేయక అలా తల దించుకొని ఎందుకు దానమిస్తున్నారు?' అని ఒక చీటీపై వ్రాసి పంపించారు. అప్పుడు రహీమ్ సమాధానమిస్తూ 'ఇచ్చేవాడు వేరే ఉన్నాడు. ఆయన నా ఈ చేతులతో ఇప్పించడానికై అహోరాత్రాలూ నాకు సంపదనిస్తున్నాడు. ఈ జనులే తెలియక నేనిస్తున్నానని భ్రమ పడుతున్నారు. అందుకే తల దించుకొని ఇస్తున్నాను' అని వినయంగా వ్రాశారు.

    భియా దేయం - భయపడుతూ దానమివ్వాలి. 'భయమెందుకు?' అంటే 'మనకున్నది అయిపోతుందేమో' అని కాదు. 'నేను సరిగ్గానే దానమిస్తున్నానా? దేశకాలాలకు తగినట్లుగా, సరైన పాత్రత కలిగిన వారికే ఇస్తున్నానా? శ్రద్ధగా ఇస్తున్నానా? ఇచ్చిన దానిమీద వెంటనే విరాగాన్ని పొందుతున్నానా? నా స్తోమతకు తగినంతగా ఇస్తున్నానా? నాలో గర్వం కలగడం లేదు కదా?' ఇలా అనుక్షణం తనను తాను పరిశీలించుకుంటూ, భయభక్తులతో దానం చెయ్యాలి. శ్రద్ధ, భయభక్తులు లోపించిన ఏ కార్యమైనా అహంకారానికి, ఆ వ్యక్తి పతనానికి దారితీస్తుంది.

     సంవిదా దేయం - సంవిత్ అంటే జ్ఞానం. దానమిచ్చే పద్ధతినెఱిగి ఇవ్వాలి. అలాగే సంవిదా అంటే ఒప్పందం. అంటే ఒకసారి ఇస్తానని మాట ఇచ్చిన తరువాత తనకు ఎంత కష్టమొచ్చినా వెనుదిరగకూడదు. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, సక్తుప్రస్థుడు, హరిశ్చంద్రుడు ఇటువంటి దాతలందరూ తమకు ఎంతటి కష్టం కలిగినా వెనుదిరుగక దానమిచ్చినవారే. అటువంటివారు మనకు ఆదర్శం కావాలి.