కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమని మనందరికీ తెలిసిందే. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులలో అమ్మను ఆరాధించుకొని, కార్తీక మాసంలో మన తండ్రియైన పరమేశ్వరుని ఆరాధించుకుంటాం. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి ఇది కార్తీక మాసం అయ్యింది. నాలుగు గురుపూర్ణిమలలో ఆషాఢ పూర్ణిమ ఆశను, కార్తీక పూర్ణిమ కామాన్ని, మాఘ పూర్ణిమ మాయను తొలగిస్తాయని, వైశాఖ పూర్ణిమ వైరాగ్యాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు.
కృత్తిక అంటే వాహనం. ఈ శరీరమే మనకు వాహనం. ఎంతవరకు ఈ శరీరాన్ని వాహనంగా గుర్తించక ఇదే నేనని భావిస్తూ ఉంటామో అంతవరకు మన చుట్టూ కనిపించేవన్నీ మనకు భిన్నంగా ఉన్నట్లే తోస్తుంది, వాటిమీద కామక్రోధాలు కలుగుతూనే ఉంటాయి. శరీరాలను దాటి సర్వవ్యాపకమైన ఆత్మను గుర్తించి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే ఈ కామాన్ని పోగొట్టుకోగలం. వ్యష్టి భావన ఉన్నంతవరకు కలవడం, విడిపోవడం ఉంటాయి. సమష్టి భావన ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు ఉన్నదంతా ఒక్కటే.
అలా ఒక్కటే అయిన పార్వతీ పరమేశ్వరులను దేహభావనతో విడివిడిగా చూసి, వారిని కలపాలనే ఉద్దేశ్యంతో వెళ్ళిన మన్మధుడు త్రినేత్రుని మూడవ కంటినుండి ఉత్పన్నమైన మహాగ్ని జ్వాలలలో భస్మం అయిపోయాడు. మళ్ళీ అమ్మ అనుగ్రహంతో విదేహుడిగా జీవితుడయ్యాడు. మనలో కూడా ఈ మూడవ నేత్రం అనబడే జ్ఞాననేత్రం ఎప్పుడైతే తెరచుకుంటుందో అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో మనలోని సంకల్పాలు, కర్మలు, కామవాసనలు అన్నీ దగ్ధం అయిపోతాయి. అటువంటి స్థితిని పొందిన మహాత్మునిలో ఏదైనా కోరిక కలిగినా అది తనకోసం కాక లోకకళ్యాణ కారకమే అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి భస్మమైన తరువాత ఇక మన్మధుడికి దేహం లేనట్లే ఆ మహాత్ముల సంకల్పాలు తమ ఒక్క దేహానికి పరిమితం కాకుండా సర్వ జగత్తుకు చెందినవై ఉంటాయి.
కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణంలో నుండి పరమేశ్వరునితో పాటు ఊరేగింపుగా భక్తులందరూ వెళతారు. అలా వెళ్ళినవారికి యమలోకం చూడవలసిన అవసరం ఉండదని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి మనలోని కామాన్ని దగ్ధం చేసివేస్తే ఆ జ్వాలలను దాటి మనం పరమేశ్వరునితో కలిసి ప్రయాణిస్తూ ఉంటాం కదా! ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే - స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతక, అంధకాంతకం, తమ్ అంతకాంతకం భజే - అని శివ తాండవ స్తోత్రం చూపిస్తోంది.
ముందుగా స్మరాంతకం అంటే మన్మధుని, లేక కామాన్ని నశింపచేసినవాడు - ఇది మనం పైన వివరించుకున్నాం కదా. ఇక పురాంతకం అంటే త్రిపురాసుర సంహారి. ఎప్పుడైతే మనలో కామం పోతుందో అప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలనబడే త్రిపురాలు నశించిపోతాయి. అంటే పైకి చూడటానికి దేహం కనబడుతున్నా దానితో మనకి సంగం నశిస్తుంది. ఇక భవాంతకం అంటే ఈ దేహాలతో ఎప్పుడు సంగం పోతుందో అప్పుడింక మనని జననమరణ విషవలయమైన ఈ సంసారం బంధించలేదు.
మఖాంతకం అంటే దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినవాడు. యజ్ఞం కర్మతో కూడుకున్నది. మనం చేసే కర్మలన్నీ భగవదర్పణంగా చేయకుండా కర్తృత్వ భావనతో చేస్తూ భగవంతుని ఎప్పుడైతే ప్రక్కన పెడతామో అప్పుడు మనకు ఆ కర్మల ద్వారా శోకం, మరొక జన్మం తప్పదు. ఇటువంటి కామ్య కర్మలను తొలగిస్తాడు పరమేశ్వరుడు. కానీ అటువంటి స్థితిని పొందిన మహాత్ముడు కర్మహీనుడు అవడు. మనం మామూలుగా మనకు ఏ ప్రయోజనమూ లేకపోతే అటువంటి కర్మలను 'ఏం చేస్తాం లే' అని బద్ధకిస్తాము. కానీ జ్ఞానాగ్నిలో కర్మలను దగ్ధం చేసుకొన్న మహాత్ముడు తనకు ఏ ప్రయోజనమూ లేకపోయినా ఎటువంటి బద్ధకమూ లేకుండా లోకోపకృతికి కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ బద్ధకము, లేక తమోగుణమే గజం. ఇప్పుడది నాశనం అయిపోయింది. అదే గజాంతకం అంటే.
అంధకాంతకం - పరమేశ్వరుడు అంధకాసురుడనే రాక్షసుని సంహరించాడు. ఈ అంధకాసురుడు ఎక్కడినుంచి వచ్చాడు? ఆయనలోనుండే వచ్చాడు. అలా మనలో నుండే ఉద్భవించి మన నిజ స్వరూపాన్ని మరుగు పరిచే అజ్ఞానమనే అంధకారాన్ని హరిస్తాడు పరమేశ్వరుడు. ఇలా హరుని ద్వారా అన్ని ప్రతిబంధకాలను హరింపజేసుకున్న మనకు జనన మరణాలు లేని మోక్షస్థితి లభిస్తుంది. అప్పుడిక యమలోకాన్ని చూడవలసిన అవసరం మనకేమి ఉంటుంది. అందుకే అంతకాంతకం.
అటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ గురురూపాన్ని ధరించి వచ్చి, మనకు తోడు నీడగా మనతో నడయాడి, సదా మనలోనే ప్రకాశిస్తున్న తమ స్వస్వరూపాన్ని మనకు దర్శింపజేస్తున్న ఈ కార్తీకపౌర్ణమి మన జీవితాలలో సదా వెన్నెలలు నింపుతూనే ఉంటుంది.