శ్రీ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. సుందరకాండ మొదటి సర్గలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఆకాశం ఎలా ఉందో వర్ణిస్తూ వాల్మీకి మహర్షి 'ఈ ఆకాశం విశ్వావసుడనే గంధర్వునికి నివాస స్థాన'మని చెబుతాడు. విశ్వంలోని సమస్త జీవులకు వాటివాటికి తగ్గట్లుగా ఆవాసాలను(నివాసాలను) ఏర్పాటు చేసే బాధ్యత ఈ విశ్వావసునిది. సృష్టిలోని ప్రాణులన్నీ కూడా తమ తమ నివాసాలను స్వయంగా నిర్మించుకోవడమో, లేదా కొండగుహలు, చెట్టు తొర్రలు వంటి స్వతస్సిద్ధంగా ఏర్పడిన మరుగు ప్రదేశాలను తమ నివాసాలుగా మార్చుకోవడమో చూస్తూ ఉంటాం.
పక్షులయితే ఈ ఇల్లు కట్టుకొనే విద్యలో బహు నేర్పరులు. ఎక్కడెక్కడి పుల్లలను, గడ్డి పరకలను సేకరించి తమ పిల్లలకు సౌకర్యవంతంగానూ సురక్షితంగానూ ఉండేలా తమ గూడును ఏర్పరచుకుంటాయి. గిజిగాని గూడు గురించి మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదా! కొన్ని పక్షులయితే తాము లోపలికి వెళ్ళడానికి ఒక రహస్య ద్వారాన్ని నిర్మించి, పాములవంటి శత్రువులను మోసం చేయడానికి మాయా ద్వారాన్ని కూడా నిర్మిస్తాయి. మనిషికి కూడా తప్పనిసరిగా కావలసిన వాటిగా కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటినీ చెబుతారు కదా! అవి లేనివారికి ప్రభుత్వాలు వాటిని అందిస్తూ దానికి తమ నాయకుల పేర్లో, తల్లిదండ్రుల పేర్లో పెడుతూ ఉంటాయి. ఒకప్పుడు మనుషులు అందరూ కూడా తమ నివాసానికి కావలసినట్లుగా పర్ణశాలలను తామే నిర్మించుకొనేవారు. వనవాస కాలంలో శ్రీరాముడు, అలాగే పాండవులు కూడా తమ నివాసాలను నిర్మించుకోవడం మనం చూస్తాం.
అయితే క్రమేపీ అవసరాలు వెనుకబడి, ఆశలకు పెద్దపీట వేయడం, అవసరానికి మించి సంపాదించి తరతరాలకు దాచుకోవడం మొదలుపెట్టడంతో పెద్దపెద్ద ఇళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టి మనిషి ఆ ఇంటి నిర్మాణానికి వేరొకరిమీద ఆధారపడవలసి వస్తోంది. ఎంత సంపాదించినా, కూడబెట్టినా, ఎంత పెద్ద రాజభవనాన్ని నిర్మించుకొన్నా చివరికి వట్టి చేతులతో మట్టిపాలు కావలసిందే. 'ఈ భూమికి నేను యజమానిని' అని విర్రవీగే వానిని చూసి భూమి నవ్వుకుంటుందిట 'నీలాంటి వారిని ఎంతమందిని నాలో కలిపేసుకున్నానో! ఇదే భూమికి నేను యజమానినని ఇప్పటికి ఎంతమంది విర్రవీగి చివరికి నాలో కలిసిపోయారో' అని.
అయితే మనకు నిజమైన నివాసం ఏది? అని ఆలోచిస్తే 'ఈశావాస్యమిదగ్గ్ సర్వం' అని ఉపనిషత్తు చెబుతోంది. ఈ జగత్తు అంతా ఈశ్వరునికి ఆవాసమై ఉన్నది. మరి జగత్తుకి ఆవాసం ఏది? అంటే అది ఈశ్వరుడే. ఎందుకంటే జగత్తు ఈశ్వరునికి భిన్నంగా లేదు. సముద్రంలో అనేక కెరటాలు పుట్టి, కొంతదూరం ప్రయాణించి మళ్ళీ అందులోనే లీనమైపోతూ ఉంటాయి. కెరటంగా కనిపించినంత సేపూ అందులో ఉండే నీటికి ఆ కెరటం ఆధారమైనట్లుగా మనకు తోస్తుంది. కానీ ఆ కెరటానికి ఆధారం కూడా విశాలమైన సముద్రమే కదా! నిజానికి సముద్రం లేకుండా కెరటానికి ఉనికి లేదు. కెరటం తయారైంది కూడా ఆ సముద్రపు నీటితోనే. కొంతసేపు అది సముద్రానికి వేరుగా ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ చివరికి తన స్వస్వరూపంలో లయం అయిపోతోంది.
అలాగే పరమాత్మ తనలోనుండే పంచభూతాలను సృష్టించి వాటితో ఈ సమస్త ప్రాణులను తయారు చేశాడు. కుమ్మరి తనకంటే వేరుగానున్న మట్టిని తీసుకొని దానితో కుండలు చేసినట్లుగా పరమాత్మ సృష్టి చేయాలంటే తనకన్నా వెరైనది ఏదీ లేనేలేదు కదా! కాబట్టి విశ్వానికంతటికీ నిజమైన ఆవాసం పరమాత్మ. అదే పరమాత్మ విశ్వంలోని ప్రాణులన్నింటి దేహాలను తన ఆవాసాలుగా చేసుకొని వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగి మన పాంచభౌతిక దేహాలను ఆ పరమాత్మ నివాసానికి యోగ్యమైన దేవాలయాలుగా స్వచ్ఛంగా, నిర్మలంగా మలచుకొని నిజమైన శాంతిని, ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిద్దాం.
Om Sri Gurubhyo Namah !
రిప్లయితొలగించండి