అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా
ప్రత్యక్షో గురు రూపేణ వర్తే భక్తి సిద్ధయే
భౌతికంగా మన కంటికి కనిపించని మహాదేవుడు తన భక్తుల భక్తిని సిద్ధింపజేయడానికి గురు రూపంలో ప్రత్యక్షమవుతాడని మన సనాతన ధర్మం బోధిస్తోంది. మన పవిత్ర భారతావనిలో యుగయుగాలుగా శ్రీ దక్షిణామూర్తి, దత్తాత్రేయులు, వశిష్ఠులు, వేదవ్యాసులు, శుకమహర్షి వంటి ఎందరో గురువులు అవతరించి మానవాళికి భగవంతుని చేరుకునే సులభమైన మార్గాన్ని ఉపదేశించి, మానవ జీవిత చరమ లక్ష్యమైన ముక్తిని పొందింపజేశారు. ఇక ఈ ఆధునిక కాలంలో కూడా శ్రీ ఆది శంకరాచార్యులు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, రాఘవేంద్రస్వామి, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, భగవాన్ రమణమహర్షి, శిరిడీ సాయిబాబా, మలయాళస్వామి వంటి ఎందరో సద్గురువులు ఈ గడ్డపై అవతరించారు. అందుకే మన భారతదేశం ‘రత్నగర్భ’ అని కీర్తింపబడింది. వారి కోవకు చెందినవారే సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్.
శ్రీ బాబూజీ ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు అవతరించారో ఎవరికీ తెలియదు. పసిప్రాయంలోనే కఠోర ఆధ్యాత్మిక సాధన చేసి సిద్ధిని పొందారు. సుమారు 1930 ప్రాంతాలలో ఉభయ గోదావరి జిల్లాలలోని ఉప్పాడ, యనమదుర్రు, భీమవరం, గుండుగొలను, అలాగే గుంటూరు ప్రాంతంలో కూడా తమకు తాముగా భక్తులకు ప్రకటితమై, వారి వారి ఇండ్లకు తరచుగా వస్తూ, వారి సమస్యలను తీరుస్తూ, వారిలో ఆధ్యాత్మిక భావనలను నెలకొల్పారు. ఆ కాలంలో ఆచరణలో ఉన్న కులభేదాలు, అంటరానితనం వంటి దురాచారాలను, మతం పేరిట ప్రబలంగా ఉన్న అనేక మూఢనమ్మకాలను రూపుమాపటానికి విశేష కృషి చేశారు. సత్యం, శాంతి, దయ, ప్రేమలే తమ ఆధ్యాత్మిక బోధనలకు మూలస్తంభాలుగా చేసుకొని, మానవునికి మానవునికి మధ్య గల భేదబుద్ధిని తొలగించి పరస్పర ప్రేమను సమభావనను నెలకొల్పారు.
అణిమాది అష్టసిద్ధులు తమ సొంతమైనా ఏనాడూ వాటిని తమ స్వార్థంకోసం కానీ, పేరుప్రతిష్టల కోసం ఉపయోగించక కేవలం ఆర్తులను, ఆపదలో ఉన్నవారిని ఉద్ధరించడానికి మాత్రమే ఉపయోగించేవారు. అలా వారివలన ఆపదలనుండి రక్షణ పొందినవారు, వైద్యులచే మరణించారని నిర్ధారణ జరిగిన తరువాత తిరిగి బ్రతికినవారు ఎందరో ఉన్నారు. వారికి ప్రచారం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ‘నేను ఆధ్యాత్మిక గురువును కాబట్టి మీ సాంసారిక సమస్యలతో నాకు సంబంధం లేదు’ అని వారు ఎన్నడూ అనలేదు. వారు బోధించే శుద్ధ అద్వైత తత్వం బోధపడాలంటే ముందు ఆ మానవుడి కడుపు నిండాలి, అతనిని అశాంతికి గురి చేస్తున్న సమస్యలు తీరాలి అని వారు బలంగా విశ్వసించారు. అందుకే ముందుగా వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపి, ఆ తరువాత మెల్లగా వారిని ఆధ్యాత్మికత వైపుకు మరలించేవారు.
ఒక్కసారి శ్రీ బాబూజీని ఆశ్రయించి వారి వాత్సల్యాన్ని చవిచూసినవారు కుటుంబ సమేతంగా, తరతరాలుగా వారిని విడువక ముక్తిమార్గంలో పయనం కొనసాగించారు. అలా శ్రీ బాబూజీ శిష్యులందరూ మనోపరివర్తన చెంది కులమతాలకతీతంగా అందరూ ఒకే కుటుంబంగా మెలగుతున్న సమయంలో వివిధ ప్రాంతాలలో ఉన్న తామందరము ఒకే చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఉంటే అది తమ ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని గాఢంగా విశ్వసించి మరీమరీ ప్రార్థించిన మీదట 1972 మే 31న శ్రీ కాళీవనాశ్రమం(శ్రీ కాళీ గార్డెన్స్) గుంటూరు విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన, నంబూరు రైల్వేస్టేషనుకు ఎదురుగా ఏర్పడింది.
భక్తులందరూ గృహస్థాశ్రమాన్ని అవలంబిస్తూ కుటుంబ సమేతంగా ఇక్కడ జీవించడం ఈ ఆశ్రమం ప్రత్యేకత. సన్యాసాశ్రమం బహు కష్టతరమైనదని, గృహస్తుగా ఉంటూనే గురువులు చూపిన మార్గంలో సాధన చేస్తే తప్పక తరించవచ్చుననేది శ్రీ బాబూజీ సిద్ధాంతం. శ్రీ బాబూజీ హస్తాలలో స్వయంభువుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి, దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ పరమహంస వారిచే పూజలందిన మూర్తిని పోలియున్న శ్రీ కాళికాపరమేశ్వరి ఆలయాలు, శ్రీ కోదండరామ, రాధాకృష్ణ ఆలయాలు ఈ ఆశ్రమంలో దర్శించవచ్చు.
విశ్వశాంతికై మూడు యాగాలను కూడా శ్రీ బాబూజీ ఇక్కడ నిర్వహించారు. ఆశ్రమ పరిసర గ్రామాలైన పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజ మొదలైన గ్రామలలోని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయటానికై పాఠశాలను, వైద్యశాలను కూడా నిర్మించారు. ఇవి రెండూ అతి తక్కువ ఖర్చుతో, అర్హులైనవారికి ఉచితంగా విద్య వైద్య సదుపాయాలను అందిస్తున్నాయి. ఇలా మానవాళికి భౌతిక, ఆధ్యాత్మిక సేవలు అందించడానికి ఒక మహత్తర సంస్థను ఏర్పరచి శ్రీ బాబూజీ 1988 డిశెంబర్ 3వ తేదీన తమ అవతారాన్ని చాలించారు. వారి మహాసమాధి శ్రీ బృందావనంగా ప్రఖ్యాతిగాంచి ఆశ్రమంలో ప్రముఖ దర్శనీయ క్షేత్రం అయ్యింది.
అనంతరం శ్రీ బాబూజీ ప్రియశిష్యులైన యోగినీ శ్రీ చంద్ర కాళీప్రసాద మాతాజీ ఆశ్రమ బాధ్యతలను చేబట్టి గురుదేవుల బోధలను దేశదేశాంతరాలలో ప్రచారం చేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. ఆశ్రమానికి హైదరాబాదు, పెదనిండ్రకొలను, గుండుగొలను, బెంగళూరు, భీమవరం తదితర ప్రాంతాలలో శాఖలను ఏర్పరచి, అనేక యజ్ఞయాగాదులను, ఉచిత ఆన్నదాన పథకాన్ని, వయోవృద్ధులకు ఆశ్రిత ఆశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి, మహాశివరాత్రి, ధనుర్మాసం, భోగి, సంక్రాంతి, కార్తీకమాసంలో వచ్చే శ్రీ బాబూజీ వారి ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతాయి. గురుదేవుని సర్వదేవతా స్వరూపులుగా భావించి, ప్రతి పండుగకు, తమ జీవితాలలో జరిగే ప్రతి శుభాశుభ సంఘటనల సందర్భంగాను భక్తులు శ్రీ గురుపూజను నిర్వహిస్తారు.
దసరా ఉత్సవాలలో పంచిపెట్టే మంత్రపూతమైన అక్షతలు, జగన్మాత పూజాకుంకుమ, భోగినాడు శ్రీగురుదేవులకు అభిషేకించి పంచిపెట్టే భోగిపళ్ళు, నాణేల కోసం విశేషంగా భక్తులు తరలివస్తారు. అలాగే శ్రీ రామలింగేశ్వరాలయంలో కులమతాలకతీతంగా భక్తులు గర్భాలయంలో ప్రవేశించి, స్వామిని తాకి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే ఆశ్రమంలోని ఆలయాలన్నింటిలో అనేకమంది స్త్రీలు అర్చకులుగా, సహాయకులుగా, పురోహితులుగా సేవలు అందిస్తూ ఉంటారు. ఇలా కుల, లింగ, వర్ణాశ్రమ భేదాలకతీతంగా సర్వులూ భగవత్సేవకు, ఆధ్యాత్మిక సాధనకు, ముక్తిని పొందటానికి అర్హులేనని నిరూపిస్తోంది శ్రీ కాళీవనాశ్రమం.
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
రిప్లయితొలగించండి