22, మార్చి 2016, మంగళవారం

వాత్సల్యం


ఆవు దూడని వత్సం అంటారు. సాధారణంగా ఆవు తాజాగా ఉండే పచ్చగడ్డినే తింటుంది కానీ కనీసం ఎవరైనా తొక్కిన గడ్డిని కూడా తినడానికి ఇష్టపడదు. కానీ అదే ఆవు తనకు బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ శరీరాన్నంతా నాకి ఆ మావిని రక్తాన్ని శుభ్రంగా తొలగించివేస్తుంది. అలాగే తన బిడ్డకు ఎటువంటి గాయమైనా నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది, స్వస్థత కలిగిస్తుంది. అందుకే నిష్కల్మషమైన, నిస్వార్థమైన ఆ తల్లి ప్రేమను వాత్సల్యం అని పిలుస్తారు.

అలాగే మహాత్ములు, గురువులు, బ్రహ్మజ్ఞానులు సదా ఆత్మానంద సుఖాన్ని అనుభావించడాన్నేఇష్టపడతారు కానీ తుచ్ఛమైన ప్రాపంచిక విషయాల మీద ఎంతమాత్రం ఆసక్తి చూపడానికి ఇష్టపడరు. కానీ తమ పుత్రసమానులైన ప్రజలు మాయలో పడి నానా రకాల కష్టాలు అనుభవించడాన్నిచూసినప్పుడు మాత్రం వారి హృదయం వాత్సల్యంతో ద్రవిస్తుంది. కేవలం నిర్హేతుకమైన, నిస్వార్థమైన ఆ వాత్సల్యం కారణంగానే వారు తమ స్వస్వరూప ఆనంద స్థితినుండి క్రిందకు దిగి వచ్చి జీవకోటిని ఉద్ధరించటానికి ఇంతగా పాటు పడుతున్నారు. ఏమిచ్చి మనం వారి ఋణం తీర్చుకోగలం?

6, మార్చి 2016, ఆదివారం

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

పేడ ఎంతో తడిగా చేతికి అంటుకుంటూ, పురుగులతో కులకులలాడుతూ, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. అదే పేడను ఎండబెట్టి అగ్నిలో దగ్ధం చేస్తే విభూతిగా మారుతుంది. అది సువాసనలను వెదజల్లుతూ అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. దానికి అంటుకునే స్వభావం పోయి ఉఫ్ అని ఊదగానే ఎగిరిపోతుంది. అసలే తెల్లగా ప్రకాశించే పరమేశ్వరుడు ఎంతో ప్రీతితో ఆ భస్మాన్ని తన దేహమంతా అలదుకొని మరింతగా ప్రకాశిస్తాడు. మలిన స్థితిలో మన మనస్సు కూడా అలాగే అన్నింటికీ అంటుకుంటూ, సంకల్పాలతో కోరికలతో నీచభావాలతో కులకులలాడుతూ, దుర్గంధభూయిష్టంగా ఉంటుంది. ఆ మనస్సును వైరాగ్యంతో ఎండబెట్టి, ధ్యానాగ్నిలో దగ్ధం చేస్తే అది పవిత్రమైన విభూతివలె శుద్ధమనస్సుగా మారుతుంది. అది తన అంటుకొనే స్వభావాన్ని కూడా కోల్పోతుంది. విభూతిని శరీరమంతా పూసుకోవటం అంటే ఎంతో ఇష్టపడే పరమేశ్వరుడు అటువంటి మనస్సు అంతా తానే నిండిపోతాడు. అంతకు మించిన పరమ శాంతి ఎక్కడ ఉంటుంది? అటువంటి పరమ శాంతిని ఆ భస్మోద్ధూళిత విగ్రహుడైన పరమేశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ శ్రీమహాశివరాత్రి శుభాకాంక్షలు.