30, అక్టోబర్ 2011, ఆదివారం

రావు గోపాల రావు

 నేను చెన్నైలో పని చేసే రోజుల్లో ఒకసారి మా ప్రాజెక్ట్ పూర్తయిన సందర్భంలో జరిగిన మీటింగుకి మా మానేజరు SKS అనే ఒక ఆయన్ను పిలిచి ఆయన వచ్చినందుకు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది. కానీ మేము అంతకు ముందు ఈ SKS అనే ఆయన్ను చూడటం కానీ ఆయన పేరు వినటం కానీ జరగలేదు.

మేము మా సీటుకి తిరిగి వచ్చాక నా మిత్రుడు నాగరాజు, నేను కలిసి ఈ SKS ఎవరో తెలుసుకుందామని outlook directory అంతా పరిశోధించి చివరికి ఆయన పూర్తి పేరు కనిపెట్టగలిగాం. ఇంతకీ ఆయన పూర్తి పేరు శ్రీనివాసన్ కన్నన్ శ్రీనివాసన్.

ఆ పేరు చదవగానే నేను ఇదేం పేరు రావు గోపాల రావు లాగా అన్నాను. అది వినగానే నా స్నేహితుడు ఎంతో ఆశ్చర్యపోయి నిజమే కదా, చిన్నపటినుంచి రావు గోపాల రావు నటించిన ఇన్ని సినిమాలు చూసాను గాని, ఇప్పుడు నువ్వు అనే దాకా అ పేరు నాకెప్పుడూ విచిత్రంగా అనిపించలేదు అన్నాడు. 

6, అక్టోబర్ 2011, గురువారం

ఉచితం

 చిన్నప్పుడు చదివిన జోకు:

వెంగళప్ప మొదటిసారిగా పట్నం వెళుతున్నాడు. అతని స్నేహితుడొకడు అతనికి జాగ్రత్తలు చెపుతూ పట్నంలో అన్ని ఎక్కువ ధర చెపుతారు. కాబట్టి మోసపోకుండా వాళ్ళు చెప్పిన దానికి సగం ధరకే బేరం చెయ్యి అని చెప్పాడు.

మన వెంగళప్ప ఒక గొడుగులు అమ్మే కొట్టుకు వెళ్లి ఒక గొడుగు ఎంత అని అడిగాడు. ఆ కొట్టువాడు ఒకటి 100 రూపాయలని చెప్పాడు. మనవాడికి వెంటనే స్నేహితుని హితోపదేశం గుర్తుకు వచ్చి 50కి ఇస్తావా అని అడిగాడు. అతను సరేనన్నాడు. వెంటనే మన వెంగళప్ప బుర్ర పని చేయటం మొదలుపెట్టింది. మళ్లీ సగం ధరకు అడుగుదామని అయితే 25కి ఇస్తావా అన్నాడు.

ఆ కొట్టువాడికి చిరాకు వచ్చి ఊరికే ఇస్తాను తీసుకువెళ్ళు అన్నాడు. అక్కడితో వదిలితే మనవాడు వెంగళప్ప ఎలా అవుతాడు? అందుకని ఊరికే రెండు ఇస్తావా అని అడిగాడు.