15, మే 2022, ఆదివారం

సులభ మార్గం

 ఘటోవా మృత్పిండోఽ ప్యణురపిచ ధూమోఽగ్ని రచలః
పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం|
వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్బజ పరమసౌఖ్యం వ్రజ సుధీః||

ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద గ్రంధాలు తల్లక్రిందులుగా అప్పజెప్పగలిగినా అవి నీ నిజ జీవిత గమనానికి ఉపయోగపడనప్పుడు అవన్నీ వ్యర్థమే కదా! అలాగే సకల వేదాలను, తర్క మీమాంసాది శాస్త్రాలను ఔపోసన పట్టినా కేవలం వాటిని కంఠస్థం చేయడంతోనే ఆగిపోతే అది వ్యర్థం. విద్యయొక్క పరమార్థం ఆత్మజ్ఞాన ప్రాప్తి, తద్వారా మోక్షఫలాన్ని అందుకోవటం. అది వదిలేసి శాస్త్ర చర్చలలో కాలం గడపడం వృధా కంఠక్షోభ అని జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు పైన ఉదహరించిన శివానంద లహరిలోని ఆరవ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు.

రకరకాల ఆకారాలలో కుండలు కనిపిస్తున్నా అవన్నీ మట్టితో చేసినవే. రకరకాల నగలు కనిపిస్తున్నా అవన్నీ బంగారంతో చేసినవే. వివిధ వర్ణాలలో అందమైన వస్త్రాలు కనిపిస్తున్నా అవన్నీ దారంతో చేసినవే. అదే విధంగా ఈ చరాచర ప్రకృతి విభిన్న అకృతులలో కనిపిస్తున్నా దానిని ప్రకాశింపజేసే ఆత్మ ఒక్కటే అని, దానిని గుర్తించమని వేదాంతం చెబుతున్నది. అది గుర్తించినవాడు సర్వత్రా ఆ సర్వేశ్వరునే దర్శిస్తూ, ఏ జీవికి ఎటువంటి హానిని కలుగజేయకుండా, అందరియెడ నిష్కారణమైన ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. అయితే అది గుర్తించి అనుభవంలోనికి తెచ్చుకోకుండా కేవలం ఆయా శ్లోకాలను వల్లెవేస్తూనో, లేదా ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది, మరి ఆ శాస్త్రంలో అలా ఎందుకు చెప్పారని వాదించుకుంటూనో జీవితం గడిపేస్తే మరి ఆ జీవితం వ్యర్థమే కదా.

నదిని దాటడానికి అనేక మార్గాలు ఉంటాయి. అయితే నదిని దాటడం మానివేసి, నీవు పట్టుకున్న మార్గం, లేదా సాధనం మీద మోహం పెంచుకొని, దానినే పట్టుకొని వ్రేళ్ళాడితే నీవు గమ్యం చేరేదెప్పుడు? మా మార్గం గొప్పదంటే, కాదు మా మార్గమే గొప్పదని, అలాగే అందరు దేవుళ్ళ కంటే మా దేవుడే గొప్పవాడని - ఇలా వాదించుకునే వారు సాధించేదేముంది? అలా కాక సద్బుద్ధి కలిగిన వారు తాము ఆశ్రయించిన, విశ్వసించిన పరమాత్ముని పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసి చాలా సుఖంగా ఈ సంసార జలధిని దాటిపోతారు.

భక్తిలేని జ్ఞానం శిరస్సులేని మొండెంలాంటిది. దానివలన సాధించేది ఏమీ లేదు. అసలు భక్తి అంటూ ఉంటే అది ఎప్పటికైనా పరాకాష్ట స్థితిని చేరి జ్ఞానంగా పరిణమిస్తుంది. ఇది సహజ జ్ఞానం. భక్తిలేని జ్ఞానం పుస్తక జ్ఞానంగానే మిగిలిపోతుంది. ఒక బంగారం కొట్టు యజమాని సహజంగానే తన కొట్టులోని బంగారు నగలన్నింటిలో వాటి వాటి ఆకార వికారాలను కాక బంగారాన్నే చూస్తాడు. అది ఏ పుస్తకంలోనూ చదువుకొని సంపాదించిన జ్ఞానం కాదు కదా. పైకి కొనుగోలుదారులతో ఎన్ని విధాలుగా ఆ నగల గురించి చర్చిస్తున్నా లోపల అతని మనస్సు సదా వీలైనంత ఎక్కువ బంగారాన్ని అమ్మి ఎక్కువ లాభం పొందాలనే ఉంటుంది. అలా కాక ఉన్నది నగలు కాదు, బంగారమే అని ఎన్నిమార్లు వల్లెవేస్తే మాత్రం ఆ దృష్టి వస్తుందా?

పరమానందయ్య శిష్యుల కథలలో ఒకదానిలో వారు ఒక పాత్రలో నెయ్యి పోయించుకొని 'పాత్రకు ఘృతం ఆధారమా? ఘృతానికి పాత్ర ఆధారమా?' అనే వాదనలో పడి చివరికి తమ చేతిలోని నేతిని మొత్తం నేలపాలు చేసుకుంటారు. అలా కాక వారు ఆ నేతిని ఉపయోగించుకొని ఉంటే ఎంత ఆనందాన్ని అనుభవించేవారు? అలాగే ఆత్మ వస్తువు తనలోనే ఉండగా దానిని అనుభవంలోనికి తెచ్చుకోకుండా ఆ ఆత్మ గురించి ఏ శాస్త్రంలో ఎలా చెప్పబడింది అనే తర్క చర్చలలో మునిగి తేలుతూ కాలం వృధా చేసుకుని చివరికి మట్టిపాలైపోతే ఏమి ప్రయోజనం?

అందుకే శ్రీగురుదేవులు "శ్లోకం లోకంలో పడితే శోకమే" అనేవారు. ఆత్మతత్వాన్ని ప్రత్యక్షంగా తెలుకోవటం కష్టమని వేదాంతంలో అనేక ప్రమాణాలు చూపించారు. అందులో ఏదో ఒక దానిని పట్టుకొని, తద్వారా ఆత్మ ఉన్నదని, అదే తన నిజస్వరూపమని గుర్తెరిగి, దానిని అనుభవంలోనికి తెచ్చుకోవటం మానేసి, ఫలానా విషయం ప్రత్యక్ష ప్రమాణమా, లేక అనుమాన ప్రమాణమా, దీనికి ఉపాదాన కారణం ఏమిటి, నిమిత్త కారణం ఏమిటి? అనుకుంటూ వృధాగా కంఠక్షోభను పొందటం ఎంతవరకు సమంజసం అని జగద్గురువులు మనలను ప్రశ్నిస్తున్నారు. ఈ కలియుగంలో మోక్షం పొందడానికి ఒకేఒక్క మార్గం, అతి సులువైన మార్గం భగవన్నామ స్మరణం. ఇంత తేలిక మార్గాన్ని వదలివేసి అనవసరమైన తర్క వ్యాకరణాది శాస్త్ర చర్చలలో, కంఠోపాఠాలలో పడి జీవితం వ్యర్ధం చేసుకోవద్దని ఇటు శివానంద లహరిలో, అటు భజగోవింద శ్లోకాలలో కూడా వారు హెచ్చరిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి