10, ఆగస్టు 2017, గురువారం

వ్యష్టి-సమష్టి

మనం ఎప్పుడూ నేను, నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా కులం, నా ఊరు, నా జాతి ఇలా ప్రతి దాంట్లో నాది, పరాయిది అని భావిస్తూ ఉంటాం. దీనినే వ్యష్టి భావన అంటారు. ఈ వ్యష్టి భావనలో ఉన్నంత కాలం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అలాగే మంచి చెడులు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాక ఈ జగత్తంతా ఒక్కటే అనే భావన దృఢమైన నాడు ఈ వ్యత్యాసాలన్నీ అంతరించిపోతాయి.

ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఎవరైనా పెద్దల దగ్గరకు వెళ్ళి "అయ్యా! నేను నుదుటన విభూతి ధరించాలి అనుకుంటున్నాను" అన్నారనుకోండి, "అయ్యో! తప్పకుండా ధరించు నాయనా. అది ఎంతో శుభప్రదం" అంటారు. అదే మీరు "అయ్యా! నేను విభూతి నా కాలికి రాసుకోవచ్చా?" అని అడిగారనుకోండి, "బుద్ధుందా? లేదా? పరమ పవిత్రమైన విభూతిని అలా అవమానిస్తావా?" అని తిడతారు. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాల పట్ల వ్యష్టి భావన ఉంది కనుక ఒక ఇంద్రియం ఉన్నతమైనది మరొకటి నీచమైనది అనే భేదాలు ఉన్నాయి. అదే మీరు "అయ్యా! నేను నా ఒళ్ళంతా విభూతి పూసుకోవాలనుకుంటున్నాను" అన్నారనుకోండి, "భేషుగ్గా పూసుకో నాయనా! సాక్షాత్తూ పరమశివునిలా ప్రకాశిస్తావు" అంటారు. మరి ఈ ఒళ్ళంతాలో తల, పాదాలు, ఇంకా మధ్యలోని అన్ని అంగాలూ, మనం పైకి చెప్పుకోటానికి సిగ్గుపడే వాటితో సహా, ఉంటాయి కదా. కానీ ఇక్కడ సమష్టి భావన ఉండటంచేత ఆ భేదాలన్నీ అంతరించిపోయి అది తప్పుగా తోచలేదు.

మరో ఉదాహరణ చూద్దాం. మీరు గుడిలోకి వెళ్లి దేవుడికి శిరస్సుతోనో, చేతులతోనో నమస్కరించారనుకోండి, చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అదే మీరు పాదాలతో నమస్కరిస్తామన్నారనుకోండి విన్నవాళ్ళు మీ పైకి చెప్పులు తీస్తారు. కానీ మరి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మనం పాదాలతో కూడా భగవంతునికి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే "ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగముచ్యతే". ఇదే వ్యష్టి భావనకు సమష్టి భావనకు ఉన్న తేడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి