11, ఏప్రిల్ 2017, మంగళవారం

దేహము - జీవుడు - ఆత్మ

సీతారాములిద్దరూ హనుమంతులవారికి తమ నిజ తత్వాన్ని సవిస్తరంగా తెలియజేసిన తరువాత శ్రీరాముడు పరీక్షగా "హనుమా! చెప్పు, నీవెవరు?" అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు "దేహబుద్ధ్యా తవ దాసోహం, జీవబుద్ధ్యా త్వదంశకః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం" అని సమాధానం చెప్పాడు. అసలు ఈ మూడూ ఏమిటో, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటో చూద్దాం.

పంచభూతాలతో నిర్మితమై మన కంటికి కనిపిస్తూ, ఇతర జ్ఞానేంద్రియాలతో అనుభూతమవుతూ ఉండే ఈ స్థూల శరీరమే దేహం. ఇక మన ఆలోచనలు, సంకల్పాలు, జ్ఞాపకాలు, కోరికలు, కర్మలు, వాసనల సమాహారమే జీవుడు. విశ్వవ్యాపకమై తాను కదలక సమస్త సృష్టిని కదిలిస్తూ ఉండే చైతన్యమే ఆత్మ.

సాధారణంగా మనం 'నేను' అని ఈ దేహాన్ని సూచిస్తూ మాట్లాడుతాం. అదే దేహబుద్ధి. ఈ దేహం నేను అనుకున్నంత కాలమూ మనం దాసులమే, రాముడు ప్రభువే. అలా కాక, ఈ దేహంలో సూక్ష్మరూపంలో ఉంటూ ఈ దేహం చేసే క్రియలన్నింటికీ ఆధారభూతమై వాటిని కర్మలుగా వాసనలుగా అంటించుకునే జీవుడు నేను అని భావించినపుడు ఆ జీవుడు దేవుడినుంచే వచ్చాడు కాబట్టి "నేను నీ అంశను" అనగలుగుతాం. ఆ జీవబుద్ధిని కూడా దాటి సర్వేసర్వత్రా నిండియున్న ఆత్మను నేను అని గుర్తించిననాడు "త్వమేవాహం" అనే స్థితికి చేరుతాం.

ఇంకా కొంచెం లోతుగా వెళితే - మనం ఒక బంగారం కొట్టుకి వెళ్ళాం అనుకోండి. అక్కడున్న నగలన్నీ చూస్తూ అందులో ఏవి కంటికి అందంగా కనిపిస్తున్నాయి, ఏవి మన వొంటిపై నప్పుతాయి అని చూస్తాం. అదే ఆ కొట్టు యజమాని మాత్రం ఏ నగ ఎంత బరువుంది, అది అమ్మితే తనకు ఎంత లాభం వస్తుంది అని మాత్రమే చూస్తాడు. అతనికి నగల అందం గురించి పట్టదు. అతనికి ఆ నగలన్నీ బంగారంలాగే కనిపిస్తాయి. ఇదే దేహబుద్ధికి జీవబుద్ధికి తేడా. అలాగే మనం రంగురంగుల గ్లాసుల్లో పాలు పోసి టేబుల్ మీద పెట్టామనుకోండి - ఇంట్లో చిన్న పిల్లలు "నాకు ఈ రంగు గ్లాసు కావాలంటే, నాకు ఆ రంగు గ్లాసు కావాలని" కొట్టుకుంటారు. అదే పెద్దవాళ్ళు గ్లాసుది ఏ రంగైనా లోపలి పాలు ఒకటే కదా అనే భావనలోనే ఉంటారు.

మనకు దేహబుద్ధి పోనంతకాలం ఇతరులను కూడా ఆ బుద్ధితోనే చూస్తాం. అందుకే ఒక కొత్త మనిషిని చూడగానే అతని ఆకారాన్ని బట్టో, వేషభాషలను బట్టో, రంగుని బట్టో ఠక్కున ఒక అంచనాకి వచ్చేస్తాం. అది ఎంత తప్పో వారితో కొంతకాలం గడిపితే కానీ తెలియదు. అదే దేహబుద్ధిని దాటి జీవబుద్దిని అందుకున్నప్పుడు మనం ఈ పైపై ఆకారవికారాలకు మోసపోక ప్రతి జీవినీ వారి వారి మస్తత్వాలను బట్టి, గుణగణాలను బట్టి మాత్రమే అంచనా వేస్తాం. నగలు ఎన్ని రూపాలలో ఉన్నా వాటిని చేసిన బంగారం నాణ్యత ముఖ్యమైనట్లు, అలాగే గ్లాసులు ఎన్ని రంగుల్లో ఉన్నా వాటిలోని పాల రుచి ముఖ్యమైనట్లు పైకి కనపడే దేహాలు ఎలా ఉన్నా వాటిలోని జీవుల సంస్కారం ముఖ్యమని గుర్తిస్తాం.

అయితే దీనిని కూడా దాటిన మహాత్ములు సర్వం ఆత్మమయంగా గుర్తించి తమకూ, చుట్టూ ఉన్న ప్రపంచానికీ ఏమాత్రం భేదం లేదనే ఎఱుకను కలిగిఉంటారు. వారికి కనీసం గ్లాసులో ఉన్నవి పాలో, నీళ్ళో, విషమో అనే భేదదృష్టి కూడా ఉండదు. అలాగే తాము ధరించినవి బంగారు నగలో, ఇత్తడి నగలో, చిరిగిన గుడ్డలో అనే దృష్టి కూడా ఉండదు. ఎదుటి వ్యక్తి ఆకారవికారాలు గానీ, ఉచ్ఛనీచ సంస్కారాలు కానీ వారిపట్ల ఎటువంటి ప్రభావమూ చూపలేవు. వారు సదా తమలోనే సర్వప్రపంచాన్నీ, అలాగే సర్వప్రపంచంలోనూ తమనీ దర్శిస్తూ ఉంటారు. అదే ఆత్మ దృష్టి, అద్వైత దృష్టి.

అయితే ఎంతటి అద్వైతాన్ని సాధించినా గురుదేవుల సన్నిధిలో మాత్రం ఎప్పుడూ మనని మనం దాసుడిగానే భావించాలి. "నాద్వైతం గురుసన్నిధౌ". అందుకే ఒక కవిగారు హనుమంతుని భక్తిని వర్ణిస్తూ "కనులనిండా ఇనవంశ సోముడు కదలాడుచుండినా ఎడదలోన శ్రీరఘురాముడు నడయాడుచుండినా తనివి తీరక తృప్తి కలుగక ఎదుట చూడాలని పదముల వ్రాలాలని, వేచి నిలిచేవా ఎదురు కాచి కొలిచేవా" అని కీర్తించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి