30, జులై 2015, గురువారం

కారు చీకటిలో కాంతి రేఖ

అది 1990వ సంవత్సరం. గుంటూరు, కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేసిన పెను తుఫాను తీరం చేరుతున్న సమయం. నేను బయటినుండి మా ఇంటి వైపుగా నడుస్తున్నాను. అప్పటికే కరెంటు పోయి చిమ్మచీకటి అలుముకుంది. అయినా తెలిసిన దారే కనుక అలాగే తడుముకుంటూ వెళ్తున్నాను. సరిగ్గా మా ఇంటి చివర మలుపు తిగుతుండగా ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. తరువాతి అడుగు వేయటానికి కాలు ఎత్తిన నేను, ఆ వెలుగులో అక్కడి బురదను చూసి చటుక్కున కాలు వెనక్కు తీసుకుని ప్రక్కనుంచి వెళ్ళాను. అక్కడ ఎంత బురదగా ఉందంటే, అందులో కాలు వేస్తే ఎక్కడో తేలేవాడ్ని. ఆ చీకట్లో, గాలివానలో నా అరుపులు కూడా ఎవరికీ వినిపించేవి కావు. సందర్భం గుర్తులేదు కానీ ఇలాగే ఇంకో ఒకటి రెండుసార్లు కూడా జరిగింది.

నేను డిగ్రీలో ఉండగా తరచుగా కాలేజి ఎగ్గొట్టి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలా ఒకరోజు కాలేజీకని బయలుదేరి రోడ్డుమీద నడుస్తూ, ఇవాళ ఏ సినిమాకి వెళదామా అని ఆలోచించుకుంటూ ఉండగా, ఒక్కసారిగా నాకు చాలా ఆవేదన కలిగింది. శ్రీగురుదేవులను మనస్సులోనే ఇలా ప్రశ్నించుకున్నాను. "నేను మామూలు బురదలో కాలు వేసి పడబోతుంటేనే అలా వెలుగు చూపించి నన్ను కాలు జారకుండా ఎన్నోసార్లు కాపాడారు కదా, మరి ఇలా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూస్తూ జీవితం పాడు చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ అడ్డుకోరు ఎందుకు?" అని.

వెంటనే నా మనసులోనుండే నాకు సమాధానం వినిపించింది. "నేను నిన్ను ఎప్పుడూ బురదలో కాలు వేయకుండా ఆపలేదు, అలాగే నిన్ను బలవంతంగా వెనక్కు లాగలేదు. నేను కేవలం చీకట్లో ఉన్న నీకు అక్కడ బురద ఉందని మాత్రమే చూపించాను. బురదలో కాలు వేస్తే కలిగే పరిణామం ఏమిటో నీ బుద్ధిలో బాగా నాటుకుని ఉంది కాబట్టి, నీ అంతట నువ్వే కాలు వెనక్కు తీసుకున్నావు. మరి అలాగే నువ్వు క్లాసులు ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళిన ప్రతిసారీ నేను నీకు నీ తప్పును ఏదో ఒక రూపంలో సూచిస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పువల్ల కలిగే పరిణామం నీ బుద్ధిలో బలంగా నాటుకోని కారణంగా నువ్వు నా సూచనలను పట్టించుకోకుండా నీ తప్పును కొనసాగిస్తూ వచ్చావు." అని.

"నిజంగా దేవుడనేవాడు ఉంటే నా తప్పులను ఎందుకు అడ్డుకోడు?" అని ప్రశ్నించే వారందరూ ఒక్కసారి వారి అంతరాత్మను తరచి చూసుకుంటే భగవంతుడు ఎన్ని విధాలుగా మన తప్పులను తెలియజేస్తున్నాడో మనకే తెలుస్తుంది. కానీ మనలోని బలహీనతల కారణంగా మనం ఆ సూచనలను పట్టించుకోకుండా, చివరికి ఆ తప్పుల ఫలితాలను అనుభవించాల్సి వచ్చిన సందర్భంలో భగవంతుని నిందిస్తాం.

భగవంతుడు/గురుదేవుడు ఒక మార్గదర్శి మాత్రమే. అయన చూపించిన మార్గంలో పయనం చేయటం పూర్తిగా మన కర్తవ్యమే. మన పిల్లలు బాగా పసివారిగా ఉన్నప్పుడు వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాం. కానీ వారు కాస్త పెద్దవారు అయిన తరువాత మనం కేవలం సలహాలనే ఇస్తాం కానీ వారిని ప్రతి విషయంలో అడ్డుకోము. ఎందుకంటే వారి తప్పులనుంచి వారు కూడా నేర్చుకోవాలని భావిస్తాం. కానీ ఎంత పెద్దవారైనా, ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళకు దాటలేని అపాయాలు ఎదురైనప్పుడు మాత్రం మనం తప్పకుండా రక్షణకు పరుగు పెడతాం. అలాగే భగవంతుడు కూడా మన తప్పులనుండి నేర్చుకోవటానికి మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. అంతమాత్రం చేత మనం నిజంగా ప్రమాదంలో పడినప్పుడు మాత్రం కేవలం మార్గదర్శనమే చేయాలని చూస్తూ ఊరుకోడు. తప్పకుండా మనలను రక్షిస్తాడు.

అలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో! మచ్చుకకి ఒకటి - న్యూయార్క్ లో ఒక ఎలక్ట్రానిక్స్ షాపుకి వెళ్ళి, ఎస్కలేటర్ మీద నుంచుని కూడా, నాకున్న సహజ కుతూహలంతో ప్రక్కకు వంగి క్రింద ఉన్న ఏవో అట్టపెట్టెల మీద పేర్లు చదువుతున్నాను. ఉన్నట్టుండి ఎవరో నా తలను వెనక్కు లాగినట్టు అయింది. వెనకాల ఎవరూ లేరు కానీ ఒక్క క్షణం నా తల అలా వెనక్కు తీయడం ఆలస్యమై ఉంటే, ఎస్కలేటర్ ప్రక్కనే ఉన్న సీలింగుకి నా తల గట్టిగా కొట్టుకుని బుర్ర పగిలి ఉండేది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి