17, మార్చి 2015, మంగళవారం

గొల్ల-గుల్ల-గోవింద

సాధకుడైనవాడు భగవంతుని పొందటానికి తన మనస్సుని ఏవిధంగా మార్చుకోవాలి అనే విషయంలో మా గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు ఒక చక్కని సన్నివేశాన్ని తెలిపేవారు.

నిజానికి రాధాకృష్ణులు తత్వతః ఏకస్వరుపులైనా రాధకి కృష్ణునితో భౌతికంగా నిరంతర సాన్నిహిత్యం లభించేది కాదు. రోజులో ఏ కొద్ది సమయమో మాత్రమే ఆమె శ్రీకృష్ణునితో గడపగలిగేది. మిగిలిన గోపికలందరిదీ కూడా ఇదే పరిస్థితి. కానీ రోజులో ఒక్క క్షణం కూడా విడువకుండా, నిరంతర సాన్నిధ్యాన్ని పొందగలిగింది మాత్రం వేణువు ఒక్కటే. ఈ విషయంలో రాధాదేవికి కొంత అసూయతోపాటు, అసలు ఇంతటి భాగ్యాన్ని పొందటానికి ఆ వేణువు చేసిన సాధన ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఉండేది. అయితే కృష్ణుడు లేని సమయంలో ఆ వేణువును చేజిక్కించుకోవటం ఎలా?

కరుణామయుడైన గోవిందుడే ఆ అవకాశాన్ని కల్పించాడు. ఒకనాడు యమునాతీరంలో ఇసుక తిన్నెలపై శయనించినప్పుడు, రాధకోసమే అన్నట్లుగా తన చేతిలోని వేణువును జారవిడిచాడు. రాధాదేవి వెంటనే ఆ వేణువును దొరకబుచ్చుకొని ఒక పొదరిల్లు చాటుకి వెళ్ళి ఆ వేణువును ప్రశ్నించింది, "ఇలా నిరంతరం గోవిందుని సాన్నిధ్యాన్ని పొందటానికి నీవు చేసిన పుణ్యం ఏమిటని". అప్పుడు ఆ వేణువు నవ్వి ఇలా చెప్పింది. "ఓ రాధా! నేను ఎట్టి సాధనలు చేయలేదు. నాకు ఏమీ తెలియదు. నువ్వే చూస్తున్నావుగా, నాలో ఏమీ లేదు. ఒళ్ళంతా చిల్లులుగల ఒక వెదురు గొట్టాన్ని మాత్రమే. అయితే నేను ఇలా అంతా ఖాళీ చేసుకోవటమే ఆ పరమాత్మకు నన్ను దగ్గర చేసిన భాగ్యం. అంతేకాదు నిరంతరంగా ఆయన అధరామృతాన్ని గ్రోలుతూ కూడా కొంచెం కూడా నాలో దాచుకోకుండా వేణునాదంగా మార్చి విశ్వమంతటికీ పంచిపెడుతున్నాను. ఇదే నేను చేసే సాధన" అని.

అంతేకాదు, గొల్లవాళ్ళైన బృందావన వాసులందరూ ఇలాగే తమ మనసులను గుల్లగా చేసుకున్నారు. అందుకే ఆ మనసులలో గోవిందుడు ప్రవేశించి వాటిని తనకు అత్యంత ఇష్టమైన నివాసస్థానాలుగా మార్చుకున్నాడు. ఇలాగే మన మనసులను కూడా ఏ విషయాలూ లేకుండా ఖాళీగా చేసుకుంటే ఆ పరమాత్ముడు అందులో ప్రతిష్టితుడై బ్రహ్మానందంలోముంచెత్తుతాడు. అటువంటి సద్భక్తులు ఆ ఆనందాన్ని కూడా తాము దాచుకోకుండా లోకానికంతటికి పంచిపెడతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి