25, ఫిబ్రవరి 2015, బుధవారం

ప్రకృతి - పురుషుడు

ప్రకృతి రెండు రకాలని భగవద్గీతలోని ఏడవ అధ్యాయంలో గీతాచార్యుడు చెప్పటం జరిగింది. అవి పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ పంచభూతాలు, వాటితో తయారైన కనపడే ప్రపంచమంతా, ఇంకా జీవులలో అంతర్గతంగా ఉండే మనస్సు, బుద్ధి, అహంకారాలు ఇవి అపరాప్రకృతి అని; ఇక ప్రతి జీవిలోనూ కూటస్థ చైతన్య రూపంలో ఉండే ఆత్మవస్తువు పరాప్రకృతి అని చెప్పబడింది.

అలాగే పురుషుడు మూడు రకాలని పదిహేనవ అధ్యాయంలో చెప్పబడింది. నిరంతరం పుడుతూ, పెరుగుతూ, చస్తూ పరిణామం చెందుతూ ఉండే ఈ కనబడే ప్రపంచమంతా క్షరపురుషుడని, ఈ జీవులలో కూటస్థ చైతన్య రూపంలో ఉండి నాశనంలేని ఆత్మవస్తువు అక్షరపురుషుడని చెప్పబడింది. అయితే విశ్వమంతా నిండి ఉండి అవ్యయుడై ఈ లోకాలన్నింటినీ నిర్వహిస్తున్న తాను ఈ ఇద్దరు పురుషులకంటే ఉత్తముడైన పురుషోత్తముడనని గీతాచార్యుడు చెప్పటం జరిగింది.

ఈ విషయాలను మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఒక చక్కని తేలికైన ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఒక కుండలో నీరు ఉన్నదనుకోండి, ఆ నీటిలో చంద్రుని ప్రతిబింబం మనకు గోచరిస్తుంది. కుండలోని నీరు ఉన్నంతవరకు చంద్రుడు వేరుగా, ప్రతిబింబం వేరుగా కనిపిస్తాయి. అదే నీరు తీసివేసామనుకోండి, ఆ ప్రతిబింబం చంద్రబింబంలో లయించిపోతుంది.

ఇక్కడ ఆ కుండ మన శరీరం. ఇక నీరేమో మనస్సు. చంద్రుడు పరమాత్మ, నీటిలో కనిపించే చంద్రుని ప్రతిబింబం జీవాత్మ. ఇక్కడ కుండ/శరీరం, నీరు/మనస్సు - అపరాప్రకృతి లేదా క్షర పురుషుడు. అలాగే ప్రతిబింబం/ఆత్మ - పరాప్రకృతి లేదా అక్షర పురుషుడు. ఇక చంద్రుడు/పరమాత్మ - పురుషోత్తముడు. కుండలో నీరున్నంతవరకూ, బింబ ప్రతిబింబాలు వేరువేరుగా కనపడినట్లు, మనకు మనస్సు ఉన్నంతవరకూ జీవాత్మ పరమాత్మలు వేరువేరుగా కనిపిస్తారు. ఎప్పుడైతే ఆ మనస్సు లయం అయిపోతుందో అప్పుడు శరీరం అలాగే ఉన్నా, జీవాత్మ పరమాత్మలో లయించిపోతుంది. అదే జీవన్ముక్త స్థితి. మా గురుదేవులు ఎప్పుడూ చెప్పేవారు - ముక్తి అంటే బ్రతికి ఉన్నప్పుడే అనుభవించాలి కానీ, చచ్చిపోయిన తరువాత ఏమీ ఉండదు, ఎత్తిపోతలే అని.

అయితే ఈ మనస్సు ఎలా లేకుండా పోతుంది అంటే - అసలు మనస్సు అంటే సంకల్పాల సమూహం. మనలో సంకల్పాలు లేకుండా పొతే ఇక మనస్సుకు ఉనికి లేదు. అలా సంకల్పాలు లేకుండా పోవటానికే మనం సాధన చేయాలి. అది ఎలా చేయాలో భగవద్గీతలో అనేక చోట్ల చెప్పబడింది. మరో సందర్భంలో చెప్పుకుందాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి